గ్రేటర్​లో వెయ్యి బస్సులు పక్కకు

గ్రేటర్​లో వెయ్యి బస్సులు పక్కకు

నేటి నుంచే అమలులోకి..
నష్టాలు తగ్గించుకునేందుకు ఆర్టీసీ చర్యలు
ప్రయాణికులకు పెరగనున్న ఇబ్బందులు

హైదరాబాద్‌‌, వెలుగు:గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో సుమారు వెయ్యి ఆర్టీసీ బస్సులను పక్కనపెట్టనున్నారు. అధిక నష్టాల కారణంగా గురువారం నుంచి ఈ కుదింపు అమలులోకి తీసుకురానున్నట్లు తెలి సింది. నష్టం వస్తున్నప్పుడు బస్సులు నడపాల్సిన అవసరం ఏముందని, హైదరాబాద్‌‌లో ప్రస్తుతం ఉన్న వాటిలో 500 బస్సులు నడపొద్దని ఇటీవల జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్‌‌ సూచించారు. వెయ్యి బస్సులను డిపోలకే పరిమితం చేసేలా ఏర్పాట్లు చేశారు. పక్కన పెట్టే బస్సులను జిల్లాల్లో నడిపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తద్వారా లాభాలను పొందాలని ఆర్టీసీ యోచిస్తోంది.

ఒక్కో డిపోలో 20 నుంచి 30 బస్సులు

వాస్తవానికి గ్రేటర్‌‌లో కాలం చెల్లిన బస్సులు(స్క్రాప్‌‌) 200 కూడా ఉండవు. ఒక్కో డిపో నుంచి 10 బస్సులు తొలగించాలని మొదట్లో నిర్ణయించగా, ఇప్పుడు 20 నుంచి 30 బస్సులు పక్కనపెట్టాలని భావిస్తున్నారు. గ్రేటర్‌‌ పరిధిలో 29 డిపోలు ఉండగా మొత్తం వెయ్యి బస్సులను పక్కన పెట్టడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చని ఆర్టీసీ అంచనా వేస్తోంది. చార్జీలు పెంచడానికి ముందు గ్రేటర్‌‌లో ప్రతి నెలా ఆర్టీసీకి రూ.96 కోట్ల ఆదాయం.. నిర్వహణ ఖర్చు రూ.145 కోట్లు ఉండేది. సమ్మెకు ముందు వరకు సగటున రోజుకు రూ.3.06 కోట్ల ఆదాయం రాగా, పెంచిన చార్జీలతో నెలలో ఆదాయం మరో రూ.31 కోట్లు పెరగనుంది.

ప్రయాణికులకు తిప్పలు

సమ్మెకు ముందు వరకు సిటీలో రోజు 3,838 బస్సులు నడిచేవి. ఇప్పుడు వెయ్యి బస్సులు పక్కనబెడితే 2,838 బస్సులే మిగులుతాయి. 3,838 బస్సులుంటేనే ప్రయాణికులు బస్సులు చాలక ఇబ్బందులు పడే వారు. బస్సుల్లో కనీసం నిలబడటానికి చోటు ఉండేది కాదు. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల ప్రమాదాలు కూడా జరిగాయి. అలాంటిది వెయ్యి బస్సులు తగ్గిస్తే మరిన్ని తిప్పలు తప్పవని ప్రయాణికులు అంటున్నారు.