వడదెబ్బకు కానిస్టేబుల్ సహా ముగ్గురు మృతి

వడదెబ్బకు కానిస్టేబుల్ సహా ముగ్గురు మృతి

కారేపల్లి/కరీంనగర్‌‌ క్రైం/జగిత్యాల టౌన్, వెలుగు:  రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి శుక్రవారం ముగ్గురు చనిపోయారు. మృతిచెందిన వారిలో ఉపాధి పనులు చేసుకునే మహిళతోపాటు ఓ కానిస్టేబుల్, 78 ఏండ్ల వృద్ధురాలు ఉన్నారు. ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం తులిస్యా తండాకు చెందిన వాంకుడోత్ సునీత(35) శుక్రవారం ఉపాధి కూలి పనికి వెళ్లింది. ఎండలో ఎక్కువసేపు పనిచేయడంతో ఆమెకు వడ దెబ్బ తగిలింది. అనారోగ్యానికి గురైన సునితను.. ఫ్యామిలీ మెంబర్స్ ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ట్రీట్మెంట్ పొందుతూ 
చనిపోయింది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

పెద్దపల్లి జిల్లాలో కానిస్టేబుల్ మృతి

సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన మధుకర్(41) కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. పిల్లల చదువురీత్యా కరీంనగర్, భగత్ నగర్‌‌‌‌లో నివాసముంటున్నాడు. ఓ మాజీ ఎమ్మెల్యే  వద్ద అతనికి గన్‌‌మెన్‌‌గా విధులు అప్పగించారు. నాలుగు రోజులు డ్యూటీ చేసి గురువారం సాయంత్రం ఇంటికి వచ్చాడు. కండ్లు తిరుగుతున్నాయని చెప్పి, రాత్రి పలుమార్లు వాంతులు చేసుకున్నాడు. ఉదయం లేచి స్నానానికి వెళ్లిన మధుకర్..​అరగంట అయినా బయటకు రాలేదు. దాంతో అనుమానం వచ్చి పెద్ద కొడుకు సాయిచరణ్ బాత్రూమ్ డోర్​ఓపెన్​ చేశాడు. అప్పటికే మధుకర్​కింద పడిపోయి చనిపోయి ఉన్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. జగిత్యాల జిల్లాలో  రాయికల్ సిటీకి చెందిన కలమడుగు మల్లవ్వ (78) తన రేకుల ఇంట్లో  పడుకుంది. ఎండ తీవ్రత, వడగాడ్పులతో ఆమెకు వడ దెబ్బ తగిలింది. దాంతో అనారోగ్యానికి గురై మృతిచెందింది. వృద్ధురాలి పెద్ద కొడుకు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు  కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.