
హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ రిజల్ట్స్‌లో ఎర్పడ్డ గందరగోళానికి తప్పెవరిదో తెలుసుకునేందుకు సర్కారు వేసిన త్రిసభ్య కమిటీ ఉత్తుత్తిదేనా? అప్పట్లో కొనసాగిన ఆందోళనలు తగ్గించేందుకు సర్కారు వేసిన ఎత్తుగడేనా? ప్రభుత్వ తీరును చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే అనిపిస్తోంది. ఫలితాల్లో తప్పులకు ఇంటర్ బోర్డు, గ్లోబరీనా సంస్థదే బాధ్యతని కమిటీ తేల్చి రెండు వారాలు కావొస్తున్నా, ఇప్పటికీ ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోవడం ఆ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నది. మరోవైపు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌ను ప్రభుత్వం పలు బాధ్యతల నుంచి తప్పించినా, ఆయా పనుల్లో ఇంకా ఆయన పెత్తనమే కొనసాగుతోంది.
ఏప్రిల్ 18 నుంచి..
గత నెల18న ఇంటర్ ఫలితాలు విడుదల కాగా, అందులో అనేక తప్పులు దొర్లాయని పేరెంట్స్, స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఐదు రోజులైనా గొడవలు తగ్గకపోవడంతో ప్రభుత్వం అదేనెల 22న ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ వేసింది. మూడు రోజుల్లో ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి చెప్పారు. తర్వాతా నిరసనలు కొనసాగడం, అవి ప్రగతిభవన్‌కూ తాకడంతో సీఎం కేసీఆర్ స్పందించారు. ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అని ప్రకటించారు. ఈ సమయంలోనూ తప్పు జరిగిందని ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం. అనంతరం రెండు రోజులకు ప్రభుత్వానికి టీఎస్‌టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. మరోపక్క విపక్షాలు, స్టూడెంట్స్ యూనియన్ల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.
చర్యలెందుకు తీసుకోలే?
ఫలితాల్లో గందరగోళానికి గ్లోబరీనా సంస్థతోపాటు ఇంటర్ బోర్డు పాత్ర కూడా ఉందని త్రిసభ్య కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఏఏ పనుల్లో నిర్లక్ష్యం జరిగిందనే విషయాన్ని అనుబంధ నివేదికల్లో స్పష్టంగా పేర్కొన్నట్టు తెలిసింది. కానీ ఇప్పటికీ ఏ అధికారికీ కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్‌ను రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌తోపాటు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాల బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డికి అప్పగించింది. అయినా అశోక్ మాత్రం ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారు. అన్ని ప్రెస్‌నోట్లు ఆయన పేరుతోనే వస్తున్నాయి. మరోపక్క మంచిర్యాల జిల్లాకు చెందిన నవ్య మార్కుల విషయంలో ఎగ్జామినర్ ఉమాదేవికి రూ.5 వేల ఫైన్ వేయగా, స్క్రూటినైజర్ విజయ్‌కుమార్‌పై ప్రభుత్వం వేటు వేసింది. మరి ఇన్ని వేల మంది తప్పులకు బాధ్యులైన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదనేది పెద్దప్రశ్నగా మిగిలింది.
కొత్త సంస్థపైనా అనుమానాలు
రిజల్ట్స్ ప్రాసెస్ చేసేందుకు ఎంపిక చేసిన డాటాటెక్ మెథడిక్స్ సంస్థపైనా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2017–18లో తమిళనాడులో పాలిటెక్నిక్ రిజల్ట్స్‌లో తప్పిదాలతోపాటు ఆ రాష్ర్ట టీచర్ రిక్రూట్‌మెంట్‌లో 196 మంది ఓఎంఆర్ షీట్లను తారుమారు చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బాధ్యతల నుంచి సదరు సంస్థను అక్కడి ప్రభుత్వం తప్పించినట్టు తెలిసింది. అలాంటి సంస్థకు ఇంటర్ ఫలితాల ప్రాసెసింగ్ అప్పగించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.