
- హైదరాబాద్, వికారాబాద్, సూర్యాపేట జిల్లాల్లో ఘటనలు
- తాగొచ్చి కొడుతున్నడని భర్తను పొడిచి చంపిన భార్య
- కల్లుకు బానిసై ఓ మహిళ ఆత్మహత్య
- లిక్కర్‌కు పైసలియ్యలేదని తల్లిని చంపేసిన కొడుకు
- తాగి వేధిస్తున్నడని కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య
- మద్యం మత్తులో హింసిస్తున్న కొడుకు.. జైలుకు పంపిన తల్లి
పరిగి/చివ్వెంల/గండిపేట్/ దిల్ సుఖ్ నగర్/ పద్మారావునగర్, వెలుగు: పచ్చని కుటుంబాల్లో మద్యం చిచ్చు పెడుతున్నది. చల్లగా ఉండాల్సిన సంసారాలు కుప్పకూలుతున్నాయి. తాగుడుకు బానిసలైన వ్యక్తులు తల్లిదండ్రులు, భార్య, కుటుంబసభ్యులకు నరకం చూపిస్తున్నారు. రోజూ ఈ తీరుతో విసిగిపోతున్న కొంతమంది ఎదురు తిరుగుతున్నారు. తెగించి సతాయిస్తున్నవాళ్లను కడతేరుస్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. ఒకచోట రోజూ తాగివచ్చి కొడుతున్న భర్తను భార్య కత్తితో పొడిచి చంపగా, మరోచోట తాగుడుకు పెన్షన్పైసలు ఇవ్వడం లేదని కన్నతల్లిని కొడుకు కొట్టి చంపాడు. ఇంకోచోట కల్లుకు బానిసైన భార్యను భర్త వదిలేయడంతో మనస్తాపంతో ఆమె చెరువులో దూకి సూసైడ్చేసుకుంది. మరోచోట తాగుబోతు కొడుకు వేధింపులు భరించలేక అతడిని కన్నతల్లే జైలుకు పంపించింది.
భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య
రోజూ తాగి వచ్చి గొడ్డును బాదినట్టు బాదుతున్న ఓ భర్తను భార్య కత్తితో15 పోట్లు పొడిచి చంపింది. హైదరాబాద్ నార్సింగిలో ఈ ఘటన జరిగింది. అస్సాంకు చెందిన భరత్ బరోడా, కృష్ణజ్యోతి బోరా దంపతులు. కొంతకాలం కిందటే పెండ్లయ్యింది. పెళ్లి తర్వాత బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చి నార్సింగి ఏరియాలో ఉంటున్నారు. భరత్ కోకాపేట్ లో నిర్మాణ రంగ కార్మికుడిగా పనిచేసేవాడు. అయితే, తాగుడుకు అలవాటుపడ్డ అతడు భార్యను కొట్టడం మొదలుపెట్టాడు. రాత్రిపూట తాగి వచ్చి కొట్టడం.. పొద్దున్నే లేవగానే ఏమీ గుర్తులేనట్టు నటించడం చేసేవాడు. కొన్నాళ్లుగా పనికి కూడా వెళ్లకుండా తాగుతూ హింసిస్తున్నాడు. దీంతో కృష్ణజ్యోతి కార్మికురాలిగా పనికి వెళ్లేది. ఎంతచెప్పినా అతడు మారకపోవడం, హింస మరీ ఎక్కువైపోవడంతో తట్టుకోలేకపోయిన కృష్ణజ్యోతి భర్తపై కోపం పెంచుకుంది. గురువారం రాత్రి కూడా అతడు తాగొచ్చి కొట్టడంతో ఆగ్రహం చెందిన ఆమె ఇంట్లో ఉన్న కూరగాయలు కోసే కత్తితో చనిపోయేదాకా 15 సార్లు పొడిచింది. చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే భరత్ చనిపోయాడు. నిందితురాలు జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కల్లుకు బానిసై మహిళ సూసైడ్
కల్లుకు బానిసైన ఓ మహిళను భర్త వదిలేయడంతో ఆమె మనస్తాపంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్చంపాపేటలోని దుర్గాభవాని నగర్‌లో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్చంపాపేట దుర్గాభవానీ నగర్ కు చెందిన పొల్లా సాయి కుమార్, భవానీ(28) భార్యాభర్తలు. వీరికి ఒక బిడ్డ, ఇద్దరు కొడుకులున్నారు. భవానీ కల్లుకు బానిసై రోజూ తాగి రోడ్లపై పడిపోయేది. భర్త, పిల్లలను అస్సలు పట్టించుకునేది కాదు. చీటిమాటికి అతడితో గొడవ పెట్టుకునేది. దీంతో విసిగిపోయిన భర్త.. ఆమెపై ఐఎస్ సదన్, సైదాబాద్ పోలీసులకు వారం క్రితం ఫిర్యాదు చేశాడు. వారు భవానీని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఈ క్రమంలో భర్త మరొక మహిళతో కలిసి ఉంటున్నాడని భవానీకి తెలిసింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె గురువారం రాత్రి సరూర్‌నగర్‌చెరువు వద్దకు వెళ్లింది. భర్తకు ఫోన్‌చేసి ‘నేను కల్లు వదల్లేకపోతున్నా.. ఇగ నేను బతుక.. పిల్లలు జాగ్రత్త’ అని చెప్పింది. తర్వాత చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త ఫిర్యాదుతో శుక్రవారం పోలీసులు, హైడ్రా, ఫైర్‌సేఫ్టీ అధికారులు గాలించి డెడ్‌బాడీని బయటకు తీశారు.
తల్లిని కొడుతున్న కొడుకు జైలుకు..
రోజూ తాగి వచ్చి కొడుతున్న కొడుకును ఓ తల్లి జైలుకు పంపింది. సికింద్రాబాద్ భోలక్ పూర్ కు చెందిన నాచారం తారక రామారావు(40) రోజూ తాగి వచ్చి తల్లిని కొట్టేవాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో ఆమె సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లిని కలిసి తన బాధను చెప్పుకుంది. దీంతో డీసీపీ ఆదేశాల మేరకు పోలీసులు రామారావును అరెస్ట్‌చేశారు. కోర్టులో హాజరుపర్చగా13వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నిందితుడికి
10 రోజుల జైలు శిక్ష విధించారు.
తల్లిని కొట్టి చంపిన కొడుకు
తాగుడుకు పైసలు ఇవ్వలేదని ఓ కొడుకు కన్నతల్లినే కొట్టి చంపేశాడు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్లో ఈ ఘటన జరిగింది. గడిసింగాపూర్‌కు చెందిన మిట్టకోడూర్మల్లమ్మ(57) భర్త పెంటయ్య 20 ఏండ్ల క్రితమే చనిపోయాడు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ ఉండగా కష్టపడి పెంచి పెద్ద చేసింది. ముగ్గురికీ పెండ్లిళ్లు కూడా చేసింది. ఉన్న 4 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటోంది. పెద్ద కొడుకు అంజిలయ్య తాగుడుకు బానిసై పని చేసేవాడు కాదు. దీంతో గొడవలు జరిగి మొదటి భార్య ఊరివేసుకుంది. కొడుకు జీవితం నాశనం అవుతుందేమోనని.. వాళ్లను వీళ్లను కాళ్లా వేళ్లా పడి తల్లి రెండో పెండ్లి చేసింది. అంజిలయ్య ప్రవర్తనతో రెండో భార్య కూడా విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. ఇంట్లో మల్లమ్మ, అంజిలయ్య ఉంటున్నారు. గురువారం అంజిలయ్య మందు తాగి వచ్చాడు. ఇంకా మందు తాగాలని, పింఛన్ పైసలివ్వాలని అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో కోపంతో ఊగిపోయిన అంజిలయ్య ఇంట్లో ఉన్న వెదురు కట్టెతో చావబాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మల్లమ్మ అక్కడికక్కడే చనిపోయింది. మల్లమ్మ రెండో కొడుకు ఫిర్యాదు మేరకు అంజిలయ్యను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
కొడుకు సాయంతో భర్త హత్య
భర్త రోజూ మద్యం తాగి వచ్చి తమను వేధిస్తున్నాడని ఆగ్రహం చెందిన భార్య అతడిని, కొడుకు సాయంతో హత్య చేసింది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగింది. తన భర్త పారెల్లి సురేశ్ (35) మద్యానికి బానిస కావడంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని ముందుగా నిందితురాలు శైలజ గురువారం చివ్వెంల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆత్మహత్య కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు.. సురేశ్ మృతదేహానికి పోస్టుమార్టం జరిపించారు. కానీ పోస్టుమార్టం నివేదికలో ఇది ఆత్మహత్య కాదని, హత్య అని తేలింది. దీంతో శుక్రవారం పోలీసులు శైలజను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో కొడుకు సాయంతో తానే చంపినట్టు ఒప్పుకున్నది. తాగి వేధిస్తుండటంతో తట్టుకోలేక చున్నీతో గొంతుకు బిగించి హత్య చేశామని, తర్వాత ఇంట్లో ఇనుప కడ్డీకి వేలాడదీసి ఉరివేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేశామని తెలిపింది.