వేంసూర్, వెలుగు: టెన్త్ ఎగ్జామ్స్ సెంటర్స్ ను ఖమ్మం డీఈవో చైతన్య జైని శనివారం ఆకస్మిక తనిఖీ చేసి నిర్లక్ష్యంగా ఉన్న ముగ్గురు ఉపాధ్యాయులను ఎగ్జామ్స్ విధుల నుంచి తొలగించారు. ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం వేంసూర్, ఆడసర్లపాడు టెన్త్ ఎగ్జామ్స్ సెంటర్స్ ను డీఈవో తనిఖీ చేశారు. ఆడసర్లపాడు ఎగ్జామ్ సెంటర్ లో విద్యార్థులు క్వశ్చన్ పేపర్ పై హాల్ టికెట్ నెంబర్ రాయకుండానే ఎగ్జామ్ సగం పూర్తి చేయడం పై డ్యూటీలో ఉన్న ఇన్విజిలేటర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎగ్జామ్ ఇన్విజిలేటర్ గా ఉన్న చాట్ల కిశోర్ ను వెంటనే ఎగ్జామ్ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్ గా ఉన్న రవి బాబు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గా ఉన్న శ్రీనివాసరావును తర్వాత ఎగ్జామ్ విధుల నుంచి తొలగించనున్నట్లు డీఈవో తెలిపారు.
