
పలు డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులపై దాడులు జరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 57వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెచేస్తున్నారు. ఈ సమ్మెతో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ప్రైవేట్ వ్యక్తులతో ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం నడిపించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలు డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులపై గుర్తు తెలియని దుండగులు దాడులు చేస్తున్నట్లు సమాచారం.
పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఉన్నప్పటికి వికారాబాద్ డిపోకు చెందిన బస్సు పరిగి నుంచి వికారాబాద్ కు వస్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బస్సుపై దాడికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్టీసీ ఉద్యోగులే ఈ దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.
మరోవైపు యాదగిరి గుట్ట డిపోలో ఆర్టీసీ తాత్కాలిక ప్రవేట్ ఉద్యోగులపై సమ్మెలో పాల్గొన్న ఓ మహిళ దాడికి పాల్పడింది. చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు.