- రేకొండ స్కూల్‌లో పాల్గొననున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, వెలుగు: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 13న ‘స్వచ్ఛ పాఠశాల’ పేరుతో పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్లను శుభ్రం చేయాలంటూ పిలుపునిచ్చారు. రేపు ఉదయం 9 గంటలకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సుమారు 2వేల స్కూళ్లలో ‘టిఫిన్ బైఠక్’ పేరుతో ఆయా గ్రామాల ప్రజలు, వివిధ పార్టీల కార్యకర్తలు, స్వచ్చంద సంస్థలు సమావేశం కానున్నారు. ఎవరి సద్ది వాళ్లే తెచ్చుకుని అందరూ స్కూల్ ఆవరణలో ఒకేచోట చేరి ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలి? ఎవరు ఏ తరగతి గదిని శుభ్రం చేయాలి? అనే అంశంపై చర్చించనున్నారు.
2వేల స్కూళ్లలో ‘స్వచ్ఛ పాఠశాల’
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని దాదాపు 2 వేల స్కూళ్లు ఉన్నాయి. రేపు ఉదయం ఒక్కో స్కూల్‌కు సగటున 25 మంది కార్యకర్తలు పాల్గొని ఎన్ని తరగతులున్నాయి? వాటిని క్లీన్ చేయడానికి ఒక్కో క్లాస్ రూంకు ఎంత మంది అవసరమని అంచనా వేస్తారు. ఒక్కో క్లాస్ రూంకు ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున బాధ్యత తీసుకుంటారు.
ఈనెల 13న సొంతంగా చీపురు, క్లాత్, బకెట్, మగ్ తీసుకొచ్చి తరగతులను శుభ్రం చేస్తారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలే కాకుండా ఆ గ్రామానికి చెందిన స్వచ్ఛంద సంస్థలు, ప్రజా, విద్యార్ధి, కుల సంఘాల నాయకులతోపాటు ప్రజలను భాగస్వాములను చేయనున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ‘స్వచ్ఛ పాఠశాల’లో భాగంగా రేపు ఉదయం చిగురుమామిడి మండలం రేగొండ స్కూల్‌లో టిఫిన్ బైఠక్ సమావేశానికి హాజరవుతారు. సొంతంగా చీపురు, క్లాత్, బకెట్ తీసుకుని ఒక తరగతిని ఎంచుకుని దానిని స్వయంగా శుభ్రం చేస్తారు.
