శివమొగ్గ: కర్నాటకలోని శివమొగ్గలో రెండు వర్గాలకు మధ్య సావర్కర్, టిప్పు సుల్తాన్ ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో గొడవ జరగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం సిటీలోని అమీర్ అహ్మద్ చౌరస్తాలోని హైమాస్ట్ లైట్ స్తంభానికి ఓ వర్గం వారు సావర్కర్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు వచ్చారు. అదేసమయంలో అక్కడికి వచ్చిన వేరే వర్గం వాళ్లు అడ్డుకుని అదే స్తంభానికి టిప్పు సుల్తాన్ ఫ్లెక్సీని కట్టేందుకు ప్రయత్నించారు.
దీంతో రెండు వర్గాలకు మధ్య గొడవ జరగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకు సిటీలోని గాంధీ బజార్ లో ప్రేమ్ సింగ్ అనే యువకుడు కత్తిపోటుకు గురయ్యాడు. అతడిని ఆస్పత్రిలో చేర్పించామని, అతనిపై దాడికి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. సిటీలో కర్ఫ్యూ విధించామని, 18వ తేదీ వరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. అయితే, ఫ్లెక్సీ వివాదం కారణంగానే ప్రేమ్ సింగ్ పై దాడి జరిగి ఉండొచ్చని కర్నాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర చెప్పారు.

