తిరుపతిలో గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం...

తిరుపతిలో గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం...

తిరుపతిలోని గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.శనివారం ( మే 23 ) ఉదయం మిథున లగ్నంలో ధ్వజారోహణ మహోత్సవంతో వైభవంగా ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాలు. ఉదయం 7.35 నుండి 8.49 గంటల మధ్య గరుడ చిత్రంతో అలంకరించిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించి బ్రహ్మోత్సవాలకు శుభారంభం పలికారు. అనంతరం స్వామివారి ఆస్థానం ఘనంగా నిర్వహించారు.

అంతకుముందు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివార దేవతలు వెండి తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు స్వామివారు. ఈ ఊరేగింపుతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారే స్వయంగా పర్యవేక్షిస్తారనే ఆధ్యాత్మిక విశ్వాసం భక్తులను అలరించింది.

అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షాబంధనం తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించి 18 గణాలు, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు అర్చకులు.

తదనంతరం ఉదయం 10.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనసేవ వైభవంగా జరుగనుంది. పెద్దశేష వాహనంపై స్వామివారు మాడవీధుల్లో విహరించనున్నారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. వేసవి దృష్ట్యా చలువ పందిళ్లు, వైట్ పెయింటింగ్‌, రంగవల్లులు, విద్యుత్ దీపాలంకరణలు, ఆకర్షణీయ పెయింటింగ్స్‌, పుష్పాలంకరణలతో ఆలయ పరిసరాలను ఆధ్యాత్మిక శోభతో తీర్చిదిద్దింది.

అదేవిధంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌, దాససాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.