- ఆగని తీస్ హజారీ కోర్టు లాయర్లు Vs పోలీసుల లొల్లి
- విధులు బహిష్కరించి న్యాయవాదుల నిరసన
- తమకు అన్యాయం జరిగిందంటూ పోలీసుల ధర్నా
- బాధితులకు న్యాయం చేస్తాం: సీపీ పట్నాయక్ హామీ
ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు దగ్గర శనివారం లాయర్లు, పోలీసుల మధ్య కొట్లాట ఘటనపై లొల్లిపై ఆగడం లేదు. ఇప్పటికే లాయర్ల డిమాండ్ కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు జుడిషియల్ ఎంక్వైరీ అదేశించింది. గాయపడిన లాయర్లకు పరిహారం ఇవ్వడంతో పాటు, పలువురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంది. అయినా లాయర్లు విధులు బాయ్ కాట్ చేసి నిరసన తెలియజేస్తున్నారు.
మాకు న్యాయం చేయాలె: పోలీసులు
నవంబరు 2న జరిగిన తీస్ హజారీ కోర్టు ఘటనలో పోలీసులు, లాయర్లూ ఇరు వర్గాల్లో కలిపి 20 మంది వరకు గాయపడ్డారు. అయితే ఢిల్లీ హైకోర్టులో ఆదివారం జరిగిన విచారణలో కేవలం పోలీసులపైనా చర్యలు తీసుకున్నారు. లాయర్లపై ఎటువంటి యాక్షన్ లేదు. దీనికి తోడు గాయపడిన పోలీసుల గురించి ఏ కామెంట్ లేదంటూ ఢిల్లీ పోలీసు సిబ్బంది ఆక్రోశం వెల్లగక్కుతోంది. తమకు న్యాయం చేయాలంటూ పోలీసు హెడ్ క్వార్టర్స్ ఎదుట వేలాదిగా పోలీసులు మంగళవారం ధర్నాకు దిగారు.
#WATCH Delhi Police personnel raise slogans of "Humara CP (Commissioner of Police) kaisa ho, Kiran Bedi jaisa ho" outside the Police Head Quarters (PHQ) in ITO. They are protesting against the clash that broke out between police & lawyers at Tis Hazari Court on 2nd November. pic.twitter.com/f4Cs7kx9Dr
— ANI (@ANI) November 5, 2019
సీపీ అంటే ఎలా ఉండాలె
హెడ్ క్వార్టర్స్ దగ్గర నిరసనకు దిగిన పోలీసు సిబ్బంది.. సీపీ (కమిషనర్ ఆఫ్ పోలీస్) పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటి పోలీసులకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. ‘సీపీ అంటే ఎలా ఉండాలి.. కిరణ్ బేడీలా ఉండాలి’ అంటూ నినాదాలు చేశారు. కమిషనర్ గా మీరే కావాలంటూ దేశంలోనే తొలి ఐపీఎస్ కిరణ్ బేడీ ఫొటోలతో ప్లకార్డులు ప్రదర్శించారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.

శాంతి భద్రతల్ని కాపాడేది మనమే
ధర్నాకు దిగిన పోలీసు సిబ్బందిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు కమిషనర్ (సీపీ) అమూల్యా పట్నాయక్. శాంతి భద్రతల్ని కాపాడేదీ, లా అండ్ ఆర్డర్ ని నిలబెట్టేది మనమే అంటూ వారిని నిరసన ఆపాలని కోరారు. బాధ్యతతో విధులు నిర్వర్తిస్తూ దేశ రాజధానిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నామన్నారు. పోలీసులపై దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు పట్నాయక్. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ‘మీ బాధ నేను అర్థం చేసుకోగలను’ అంటూ.. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని కోణాల్లోనూ ఎవరికీ అన్యాయం జరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కేంద్ర హోం శాఖకు నివేదిక
శనివారం తీస్ హజారీ కోర్టు దగ్గర పార్కింగ్ సమయంలో లాయర్, పోలీసు వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో వారి మధ్య గొడవ మొదలైంది. ఇద్దరు మనుషుల మధ్య గొడవ కాస్తా లాయర్లు, పోలీసుల కొట్లాటగా మారింది. ఇరు వర్గాలు కొట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. లాయర్లు పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులు ఒక దశలో లాఠీ చార్జ్ చేశారు. కాల్పుల వరకు వెళ్లింది. ఈ గలాటలో లాయర్లు, పోలీసులు కలిపి 20 మంది గాయపడ్డారు. ఆ రోజు జరిగిన గొడవపై పోలీసు ఉన్నతాధికారులు అంతర్గతంగా ఎంక్వైరీ చేశారు. గొడవ ఎలా మొదలైంది, రచ్చ ఎలా పెరిగింది, ఎవరిది తప్పు, తీసుకున్న.. తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి స్థాయి నివేదికను కేంద్ర హోం శాఖకు అందజేశారు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు.

