ఆర్టీసీ విలీనం కోసం టీజేఎంయూ నేత ఆమరణ దీక్ష

ఆర్టీసీ విలీనం కోసం టీజేఎంయూ నేత ఆమరణ దీక్ష
  • అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించిన పోలీసులు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టీజేఎంయూ నేత హన్మంతు ముదిరాజ్ బుధవారం బస్ భవన్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే దీక్ష మొదలైన కొద్దిసేపటికే పోలీసులు ఆయనను అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. హన్మంతు అరెస్టుతో బస్ భవన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ కార్మికులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.

అనంతరం పలువురు కార్మికులు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లి హన్మంతుకు సంఘీభావం తెలిపారు. పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే హన్మంతు ముదిరాజ్ తన దీక్షను కొనసాగించారు. ఆయనకు ఆర్టీసీ జేఏసీ నేతలు ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి, ఇతర కార్మిక సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు మద్దతు ప్రకటించారు. హన్మంతు ముదిరాజ్ అరెస్టుకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో ధర్నాలు నిర్వహించాలని టీజేఎంయూ పిలుపునిచ్చింది.

ఈ సందర్భంగా హన్మంతు మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల చిరకాల కోరికను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. విలీనం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దీక్ష కొనసాగిస్తున్న హన్మంతు ముదిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పోలీసులు వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.