కాళేశ్వరం ఇంకా పూర్తికాలేదని నిరూపిస్తా.. రా.. కేసీఆర్ : కోదండరామ్

కాళేశ్వరం ఇంకా పూర్తికాలేదని నిరూపిస్తా.. రా.. కేసీఆర్ : కోదండరామ్

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. తనతో వస్తే కాళేశ్వరం పూర్తికాలేదని నిరూపిస్తానని సవాల్ విసిరారు. రాష్ట్ర బడ్జెట్లో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. డబుల్ బెడ్ రూం, దళితులకు మూడెకరాల భూమి తదితర పథకాలకు నిధులు కేటాయించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. రుణ సాయం, మార్కెటింగ్ విధానాలు, పంట నష్టానికి పరిహారం అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ఇలాంటి వాటి కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని అన్నారు. బడ్జెట్లో రోడ్లు, బిల్డింగులు, ఇరిగేషన్ కు ఎక్కువ నిధులు కేటాయించారన్న ఆయన అవి కాంట్రాక్టు కమిషన్ల కోసమేనని విమర్శించారు. 

పథకాలు భారీగా ప్రకటిస్తున్నా.. వాటి అమలు మాత్రం ముందుకు సాగడం లేదని కోదండరాం ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగం పూర్తిగా నాశనమైందని, మౌలిక సదుపాయాల కోసం ఆ శాఖకు కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని చెప్పారు. చిరు ధాన్యాలకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ పెరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం అలాంటి వాటిని పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్లో 40 నుంచి 50 శాతం కోత విధించారన్న కోదండరామ్ కేటాయించిన బడ్జెట్ నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.