- ప్రతిపక్ష నేత ఎంపిక పత్రంలో నకిలీ సంతకాలు..
- స్పీకర్‌కు ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేల ఫిర్యాదు
- పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారంటూ
- వారిద్దరిపై వేటు వేసిన అధిష్ఠానం
- టీఎంసీలో బయటపడిన అంతర్గత విభేదాలు..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీ, సందీపన్ సాహాలను సోమవారం పార్టీ నుంచి బహిష్కరించింది. విపక్ష నేతగా సోభన్దేబ్ చటోపాధ్యాయ్ ఎంపికకు సంబంధించి అసెంబ్లీకి పంపిన పత్రంలో కొన్ని సంతకాలు నకిలీవని ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బెంగాల్స్పీకర్కు ఫిర్యాదు చేశారు. మే 6న జరిగిన టీఎంసీ శాసనసభ పక్ష సమావేశంలో విపక్ష నేత ఎంపికపై ఎలాంటి తీర్మానం జరగలేదని, తర్వాత సమర్పించిన పత్రంలో ఉన్న కొన్ని సంతకాలు అసలైనవి కావని వారు ఆరోపించారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా అసెంబ్లీ కార్యదర్శి పోలీసులకు సమాచారం ఇవ్వగా, కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. అయితే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం, పార్టీ సమావేశాలకు హాజరుకాకపోవడం, పార్టీ ప్రయోజనాలకు విరుద్ధమైన పనులు చేయడం వల్లే ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించినట్లు టీఎంసీ ప్రకటించింది. ఈ వ్యవహారంపై స్పందించిన పార్టీ నేత కునాల్ ఘోష్.. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ముందుగా పార్టీ నాయకత్వానికి చెప్పాల్సింది.. అది కాకుండా నేరుగా స్పీకర్‌ను ఆశ్రయించడం తప్పని అన్నారు.
మరోవైపు ముఖ్యమంత్రి సువేందు అధికారి మాట్లాడుతూ, ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదు ఆధారంగానే విచారణ ప్రారంభమైందని, విచారణలో కొందరు ఎమ్మెల్యేలు సంతకాలు తమవి కావని చెప్పినట్లు వెల్లడించారు. ఈ పరిణామాలతో ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే టీఎంసీ శాసనసభ పక్షంలో విభేదాలు బయటపడుతున్నాయని.. పరిణామాలు చీలిక దిశగా సాగుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతున్నది.
