మమతా బెనర్జీకి మరో షాక్.. బెంగాల్లో ప్రతిపక్ష నేతగా టీఎంసీ బహిష్కృత నేత రితబ్రత

మమతా బెనర్జీకి మరో షాక్.. బెంగాల్లో ప్రతిపక్ష నేతగా టీఎంసీ బహిష్కృత నేత రితబ్రత
  • అధికారికంగా గుర్తించిన స్పీకర్

కోల్​కత: బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) బహిష్కృత నేత రితబ్రత బెనర్జీని బెంగాల్ అసెంబ్లీలో నూతన ప్రతిపక్ష నేతగా స్పీకర్ రతీంద్ర బోస్ అధికారికంగా గుర్తించారు. టీఎంసీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే సందీపన్ సాహా నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం.. టీఎంసీ శాసనసభ పక్ష నేతగా రితబ్రత బెనర్జీకి మద్దతు తెలుపుతూ 58 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖలను స్పీకర్ రతీంద్ర బోస్‌‌కు సమర్పించింది. 

దీంతో తిరుగుబాటు వర్గం చేసిన డిమాండ్‌‌ను స్పీకర్​అంగీకరించారు. రితబ్రతను ప్రతిపక్ష నేతగా అధికారికంగా గుర్తించారు. అలాగే, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతకు కేటాయించే కార్యాలయాన్ని కూడా ఆయనకు అప్పగించారు. 

తిరుగుబాటు ఎమ్మెల్యేలు పార్టీపై మమతా బెనర్జీకున్న ఆధిపత్యాన్ని సవాలు చేయలేదు. స్పీకర్‌‌కు సమర్పించిన లేఖలో ఆమెను టీఎంసీ చైర్‌‌పర్సన్‌‌గా పేర్కొన్నారు. శాసనసభా పక్షానికి ‘చీఫ్ అడ్వైజర్’ బాధ్యతలు చేపట్టాల్సిందిగా వారు మమతా బెనర్జీని కోరారు. ఆమె తమకు ఎప్పటికీ సుప్రీం లీడర్ అని ప్రకటించారు. 

అయితే, శాసనసభా పక్ష వ్యవహారాలను నిర్ణయించడంలో ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అధికారాన్ని తాము ఇకపై అంగీకరించబోమని స్పష్టం చేశారు. కాగా, బుధవారం ఉదయం 58 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించిన తిరుగుబాటు వర్గం.. తాజా సమాచారం ప్రకారం ఆ సంఖ్య 59కి చేరిందని తెలిపింది. అంతేకాకుండా, ప్రస్తుతం రాష్ట్రం వెలుపల ఉన్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్‌‌లో ఉన్నారని, త్వరలోనే వారి మద్దతు లేఖలు కూడా అందుతాయని రితబ్రత బెనర్జీ ప్రకటించారు.

కమిటీలన్నింటినీ రద్దు చేసిన టీఎంసీ తిరుగుబాటు వర్గం ఈ వ్యూహం పన్నిన కొద్దిగంటల్లోనే బెంగాల్‌‌లోని అన్ని సంస్థాగత కమిటీలను, అనుబంధ సంఘాలను రద్దు చేస్తున్నట్టు టీఎంసీ ప్రకటించింది. సమగ్రంగా ఆలోచించిన తర్వాత బెంగాల్‌‌లోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అన్ని కమిటీలను, దాని అన్ని అనుబంధ విభాగాలను తక్షణమే రద్దు చేయాలని నిర్ణయించిందని ఆ పార్టీ ఎక్స్ వేదికగా తెలిపింది. ప్రతి స్థాయిలో ఆత్మపరిశీలన, పనితీరు సమీక్ష, సంస్థాగత అంచనాను చేపడతామని, ఆ తర్వాత మొత్తం సంస్థాగత నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరిస్తామని పార్టీ తెలిపింది.

‘మహారాష్ట్ర మోడల్’ను గుర్తుకుతెస్తున్న ఘటన

ఈ పరిస్థితి గతంలో మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే శివసేనలో తిరుగుబాటు చేసి, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో శాసనసభా పక్షాన్ని చేజిక్కించుకుని, అసలు నాయకత్వానికే రాజకీయ ఉనికి లేకుండా చేసిన ‘మహారాష్ట్ర మోడల్ ’ను పోలి ఉంది. అలాగే, 2023లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్​సీపీ)లో జరిగిన చీలికను కూడా ఇది గుర్తుకుతెస్తోంది. అప్పట్లో అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్ క్యాంప్ నుంచి విడిపోయి, మెజారిటీ శాసనసభ్యుల మద్దతుతో బయటకు వచ్చారు. ఆ తర్వాత జరిగిన చట్టపరమైన, రాజకీయ పోరాటంలో ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించి, పార్టీ పేరును, గుర్తును వారికే కేటాయించింది.