- బీజేపీ అభ్యర్థుల మెజారిటీ కంటే తొలగించిన ఓట్లే ఎక్కువ
- మధ్యంతర దరఖాస్తు చేసుకోవాలన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బెంగాల్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) వల్ల కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం పడిందని సుప్రీంకోర్టులో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపించింది. ‘సర్’పై టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చితో కూడిన బెంచ్ విచారించింది.
టీఎంసీ తరఫున ఆ పార్టీ నాయకుడు, సీనియర్ న్యాయవాది కల్యాణ్ బెనర్జీ వాదనలు వినిపించారు. బెంగాల్‌లోని 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల మెజారిటీ కంటే.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉందని కల్యాణ్ బెనర్జీ పేర్కొన్నారు.
ఒక నియోజకవర్గంలో అభ్యర్థి కేవలం 862 ఓట్ల తేడాతో ఓడిపోగా.. అక్కడ ఏకంగా 5,432 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారని వివరించారు. అలాగే, సర్పై రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 35 లక్షల అప్పీళ్లు ట్రిబ్యునళ్ల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని.. బీజేపీ, టీఎంసీ మధ్య ఓట్ల వ్యత్యాసం 32 లక్షలుగా ఉందని ఆయన కోర్టుకు తెలిపారు. దీనిపై ఎన్నికల సంఘం స్పందిస్తూ.. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ‘ఎన్నికల పిటిషన్’ ద్వారానే పరిష్కరించుకోవాలని, సర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలకు తామే జవాబుదారీ అని పేర్కొంది.
అయితే, ఈ అంశంపై సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చితో కూడిన బెంచ్ స్పందిస్తూ.. ఓట్ల తొలగింపు వల్ల ఫలితాలు ప్రభావితమయ్యాయని భావిస్తే బాధితులు స్వతంత్రంగా మధ్యంతర దరఖాస్తులు దాఖలు చేయవచ్చని సూచించింది. అప్పీళ్లు పరిష్కరించడానికి నాలుగేండ్లు పడుతుందన్న ఆందోళనపై స్పందిస్తూ.. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని సీజేఐ హామీ ఇచ్చారు.
