నాన్ గెజిటెడ్ పేరు మార్పు ప్రతిపాదన పాతదే : రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్

నాన్ గెజిటెడ్ పేరు మార్పు ప్రతిపాదన పాతదే : రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్
  •     భవనాల ద్వారా వచ్చే అద్దెలు సంఘం నిర్వహణకే వినియోగిస్తున్నాం 
  •     టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం. హుస్సేనీ ముజీబ్ 

హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ పేరును ‘తెలంగాణ నేటివ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ యూనియన్’ గా మార్చే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం. హుస్సేనీ ముజీబ్ తెలిపారు. కానీ ఈ  ప్రతిపాదన కొత్తది కాదని.. పాతదేనని స్పష్టం చేశారు. ‘టీఎన్జీవో నేతలా.. మజాకా’ పేరుతో ఆదివారం వెలుగులో ప్రచురితమైన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. 

పేరుకు మాత్రమే గెజిటెడ్ హోదా తప్ప.. ఎలాంటి అదనపు ప్రయోజనాలు లేవని చెప్పారు. ప్రభుత్వం సూపరింటెండెంట్ స్థాయిని అప్‌‌గ్రేడ్ చేసి కేవలం ‘గెజిటెడ్ స్టేటస్’ ఇచ్చింది తప్ప, వారికి గెజిటెడ్ స్కేల్ గానీ, సర్వీస్ నిబంధనల్లో మార్పు గానీ కల్పించలేదని పేర్కొన్నారు. అదనపు ప్రయోజనాలు లేని కారణంగా, డిప్యూటీ తహసీల్దార్ల తరహాలోనే వీరిని కూడా సభ్యులుగా కొనసాగించాలని 2010లోనే తీర్మానం చేశామని వెల్లడించారు. 

ఆరోపణలు అవాస్తవం 

సంఘం ఆస్తులపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని, 80 ఏండ్ల చరిత్ర కలిగిన టీఎన్జీవో భవనాలు ప్రభుత్వ సహకారంతో ఏర్పడినవేనని వివరించారు. రూ.వేల కోట్ల ఆస్తులు ఉన్నాయనడం అవాస్తవమని, భవనాల ద్వారా వచ్చే నామమాత్రపు అద్దెలు కేవలం సంఘం నిర్వహణకే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని తెలిపారు.