- మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత
- కొంతకాలంగా అనారోగ్యం.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస
- సంతాపం తెలిపిన సీఎంలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు
- 1984లో నెల రోజుల పాటు సీఎంగా రికార్డ్
- నేడు పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు (90) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో నెల రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. గురువారం సాయంత్రం పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుమారుడు, ఏపీ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు.
రాజకీయ ప్రస్థానం
నాదెండ్ల భాస్కర్రావు 1935 జూన్ 23న గుంటూరులో జన్మించారు. 1978కి ముందు భాస్కర్ రావు ఏపీ హైకోర్టులో ప్రముఖ న్యాయవాదిగా కొనసాగారు. 1978లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి విజయవాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. మర్రి చెన్నారెడ్డి కేబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఇందిరా కాంగ్రెస్ లో ఏపీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు.
నెల రోజుల ముఖ్యమంత్రిగా..
1982 మార్చి 29న ఎన్టీ రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించి 1983లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన నాదేండ్ల.. ఎన్టీఆర్ హయాంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. అయితే హార్ట్ సర్జరీ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళుతూ నాదెండ్లకు అనధికారికంగా పాలనా బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో నాదెండ్ల తీరు నచ్చని ఎన్టీఆర్అమెరికా నుంచి వచ్చీరాగానే ఆయన్ను మంత్రి వర్గం నుంచి తొలగించారు. ఆగస్టు 15న టీడీపీలో సంక్షోభం మొదలుకాగా.. కాంగ్రెస్ లోని కొందరు ఎమ్మెల్యేలను కలుపుకుని తనకు 111 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని గవర్నర్ రాంలాల్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సూచన మేరకు నాదేండ్ల భాస్కర్ రావుతో గవర్నర్ సీఎంగా ప్రమాణం చేయించారు. గవర్నర్ నెల రోజులు గడువు ఇచ్చినప్పటికీ అసెంబ్లీలో బలం నిరూపించుకోలేకపోయారు. దీంతో తిరిగి ఎన్టీఆర్సీఎంగా ఎన్నికయ్యారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు కేవలం 31 రోజుల పాటు నాదెండ్ల ముఖ్యమంత్రిగా కొనసాగారు. తద్వారా రాష్ట్ర చరిత్రలో అత్యల్పకాలం సీఎం పదవిలో ఉన్న వ్యక్తిగా
నాదెండ్ల చరిత్రలో నిలిచారు.
నేతల సంతాపం
మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా సుదీర్ఘ కాలం రాజకీయ జీవితంలో కొనసాగారని గుర్తు చేశారు. నాదెండ్ల మృతికి సంతాపం తెలిపినవారిలో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు.

