రెండు గాట్లు, ఏడు కుట్లు.. అయినా పోరాటం ఆపలే

రెండు గాట్లు, ఏడు కుట్లు.. అయినా పోరాటం ఆపలే

టోక్యో: దేశం కోసం సరిహద్దుల్లో  నిత్యం పహారా కాసే సైనికుడి ధైర్యం, తెగువ గురించి  ఎంత చెప్పినా తక్కువే. దేశ ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను అడ్డుపెట్టి పోరాడే జవాన్లు నిజమైన హీరోలనే చెప్పాలి. అలాంటి సైనికులు ఆటల్లో ఉంటే ఎంతగా పోరాడతారో ఊహించుకోవచ్చు. విజయంతో దేశానికి వన్నె తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తారు. ఇందుకు తాజా ఉదాహరణగా భారత బాక్సర్ సతీష్ కుమార్‌ను చెప్పొచ్చు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున బరిలోకి దిగిన ఈ 32 ఏళ్ల ఇండియన్ ఆర్మీ మ్యాన్.. దేశానికి పతకం అందించలేకపోయినా తన పోరాటపటిమతో క్రీడాభిమానుల మనసు దోచుకున్నాడు. 

ప్రపంచ, ఆసియా చాంపియన్‌ బఖోదిర్ జాలోలోవ్స్‌తో జరిగిన పురుషుల 91 కిలోల క్వార్టర్స్‌ పోరులో సతీష్ ఆడిన తీరు అందర్నీ కట్టిపడేసింది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రీక్వార్టర్స్‌‌లో జమైకాకు చెందిన రిచర్డో బ్రౌన్‌పై సతీష్ గెలిచాడు. కానీ ఆ మ్యాచ్‌లో సతీష్ కంటికి తీవ్ర గాయమైంది. అతడి మొహంపై రెండు గాట్లు పడ్డాయి. ఏడు కుట్లు వేసి డాక్టర్లు ట్రీట్‌మెంట్ చేశారు. అయితే గాయం వేధిస్తున్నా భయపడకుండా, వెనుకంజ వేయకుండా సతీష్ క్వార్టర్స్ బౌట్‌లో దిగాడు. బఖోదిర్ జాలోలోవ్స్‌పై పోరాడి ఓడాడు. ఓటమి ఒప్పుకోని సతీష్ తత్వం నిజంగా జవాన్‌కు ఉండే తెగువ ఏంటో చూపించింది. అందుకే మ్యాచ్‌ ముగిశాక ప్రత్యర్థి, ఉజ్బెకిస్థాన్ బాక్సర్ బఖోదిర్ సతీష్‌ను కౌగిలించుకొని మెచ్చుకున్నాడు. భారత్‌కు పతకం అందించలేకపోయినా.. దేశం కోసం పోరాడేందుకు బాక్సింగ్ రింగులో, బయటా ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని బౌట్ తర్వాత సతీష్ చెప్పాడు.