22ఏ సమస్యలపై హైలెవల్ కమిటీ..బాధితులు ఈ టోల్‌‌‌‌‌‌‌‌ ఫ్రీ నంబర్ కు కాల్ చేయండి

22ఏ సమస్యలపై హైలెవల్ కమిటీ..బాధితులు ఈ టోల్‌‌‌‌‌‌‌‌ ఫ్రీ నంబర్ కు కాల్ చేయండి
  • ప్రైవేట్ ఆస్తులను లాక్కోం.. రక్షణ కల్పిస్తం: పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి
  • రికార్డుల ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌లో జరిగిన తప్పిదాల వల్లే సమస్య
  • దరఖాస్తు ఇచ్చిన 3 నుంచి 5 రోజుల్లోనే పరిష్కరిస్తామని హామీ
  • అధికారుల తరఫున బహిరంగ క్షమాపణ కోరిన రెవెన్యూ మంత్రి


హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్​ చేసుకున్న ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ ఆస్తులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్కోదని, ప్రజల ఒక్క గజం భూమికి కూడా అడ్డుపడబోమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి  శ్రీనివాస్​రెడ్డి స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, రికార్డుల ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌లో జరిగిన తప్పిదాల వల్ల పొరపాటున 22ఏ నిషేధిత జాబితాలో చేరిన ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ ఆస్తుల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు రెవెన్యూ, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖల ఉన్నతాధికారులతో హైలెవల్‌‌‌‌‌‌‌‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బాధితులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా 1800 599 4788 టోల్‌‌‌‌‌‌‌‌ ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చామని, ఫోన్‌‌‌‌‌‌‌‌ చేసినా లేదా స్థానిక అధికారులకు సాధారణ దరఖాస్తు ఇచ్చినా 3 నుంచి 5 రోజుల్లో సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. సోమవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్ల స్థాయి నుంచి రెవెన్యూ ముఖ్య కార్యదర్శి వరకు అన్ని విభాగాల ఉన్నతాధికారులతో నాలుగు గంటలకు పైగా సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు.


గత రెండు వారాల్లో మంత్రులు, కలెక్టర్లకు అందిన వినతుల ఆధారంగా నాలుగు ప్రధాన జిల్లాల్లోని 757 దరఖాస్తులను పరిశీలించినట్లు తెలిపారు. వీటిలో మేడ్చల్‌‌ నుంచి 511, రంగారెడ్డి నుంచి 148, హైదరాబాద్‌‌ నుంచి 49, సంగారెడ్డి నుంచి 38 దరఖాస్తులు ఉన్నాయని చెప్పారు. మేడ్చల్‌‌ జిల్లాలోని 511 దరఖాస్తుల్లో సుమారు 325 యూఎల్‌‌సీ భూములకు సంబంధించినవేనని వివరించారు. 2001–02లో వివిధ ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలు, మెమోల ద్వారా క్రమబద్ధీకరణ పొంది, హార్డ్‌‌ కాపీల్లో సేల్‌‌ డీడ్లు పూర్తయినప్పటికీ.. ఆన్‌‌లైన్‌‌ రికార్డుల అప్‌‌డేట్‌‌లో నిషేధిత జాబితా నుంచి వివరాలు తొలగించకపోవడంతో సమస్య తలెత్తిందన్నారు.

అధికారుల తరఫున క్షమాపణ కోరుతున్నా..

గతంలో 22ఏకు సంబంధించి హైకోర్టులో 6 వేలకుపైగా కేసులు నమోదయ్యాయని మంత్రి పొంగు లేటి గుర్తుచేశారు. వివాదరహిత జాబితాను సమ ర్పించాలని కోర్టు ఆదేశించినప్పటికీ, నాటి అధికారులు పాత నిషేధిత జాబితాలనే మళ్లీ సమర్పించడంతో చట్టబద్ధమైన ఆస్తులు కూడా 22ఏ లోకి వెళ్లాయని తెలిపారు. ప్రభుత్వ శాఖల తప్పిదంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నందుకు శాఖ మంత్రిగా తాను బాధ్యత వహిస్తూ అధికారుల తరఫున బహిరంగ క్షమాపణలు చెబుతున్నానన్నారు. జీహెచ్‌‌ఎంసీ, హెచ్‌‌ఎండీఏ, హౌసింగ్‌‌ బోర్డు వంటి ప్రభుత్వ సంస్థలు బహిరంగ వేలంలో విక్రయించిన దాదాపు 35 వేల నుంచి 38 వేల పార్శిళ్లు కూడా ఆన్‌‌లైన్‌‌ అప్‌‌డేట్‌‌ లోపంతో 22ఏలో చేరాయని చెప్పారు. వాటన్నింటినీ వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్లు, రిజిస్ట్రేషన్‌‌ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

2 ఎకరాలకు బదులు 12 ఎకరాలు 22ఏలోకి..

రంగారెడ్డి జిల్లాలోని భూదాన్‌‌ భూముల ఉదాహరణను మంత్రి ప్రస్తావించారు. ఓ గ్రామంలో 12 ఎకరాల సర్వే నంబర్‌‌లో యజమాని 2 ఎకరాలు మాత్రమే భూదాన్‌‌ బోర్డుకు ఇచ్చినా.. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా మొత్తం 12 ఎకరాలను 22ఏలో చేర్చారని చెప్పారు. జియో ట్యాగింగ్‌‌ ద్వారా 2 ఎకరాల భూదాన్‌‌ భూమిని ప్రభుత్వం పరిరక్షిస్తూ, మిగిలిన 10 ఎకరాల ప్రైవేట్‌‌ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని తెలిపారు. మేడ్చల్‌‌ జిల్లాలోని ఆల్విన్‌‌ కాలనీ, ఆస్బెస్టాస్‌‌ కాలనీల్లో ఒకే సర్వే నంబర్‌‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌‌ భూములు కలిసి ఉన్నందున జియో కోఆర్డినేట్లు, మ్యాపుల ఆధారంగా ఒకట్రెండు రోజుల్లో సబ్‌‌ డివిజన్‌‌ పూర్తి చేసి ప్రైవేట్‌‌ ఆస్తులకు క్లియరెన్స్‌‌ ఇస్తామని చెప్పారు. నారపల్లి సర్వే నంబర్‌‌ 867లోని 20 ఎకరాల ప్రభుత్వ భూమిని వేరు చేసి, ప్రైవేట్‌‌ స్థలాలను జాబితా నుంచి తొలగిస్తామని వెల్లడించారు.