ఏటీసీ విద్యార్థులు అదుర్స్  ..పాత ఇనుప సామానుతో ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్‌‌ తయారు చేసిన యువతి

ఏటీసీ విద్యార్థులు అదుర్స్  ..పాత ఇనుప సామానుతో ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్‌‌ తయారు చేసిన యువతి
  • రూ.45 వేల ఖర్చుతోనే స్క్రాప్‌కు ప్రాణం పోసిన స్ఫూర్తి
  • రూ.1.65 లక్షలకే డ్యూయల్ పర్పస్ ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్‌‌ను ఆవిష్కరించిన మరో స్టూడెంట్
  • గిరిజన, గనుల ప్రాంతాల కోసం ఈ-వెహికల్ తయారు చేసిన పార్థసారథి
  • ఏటీసీల శిక్షణతో వినూత్న ప్రయోగాలు చేస్తున్న మణుగూరు విద్యార్థులు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐలను ‘అడ్వాన్స్‌‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)’గా ఆధునీకరించి ప్రాజెక్ట్ ఆధారిత శిక్షణ అందిస్తుండటంతో గ్రామీణ యువతలో నైపుణ్యాలు వెలుగు చూస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రభుత్వ ఏటీసీకి చెందిన ఇద్దరు విద్యార్థులు తమ ప్రతిభతో వేర్వేరు నమూనాల్లో రెండు ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ వాహనాలను తయారు చేశారు. మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఎంఈవీ) ట్రేడ్‌‌లో శిక్షణ పొందుతున్న ఆడపా స్ఫూర్తి అనే విద్యార్థిని పాత ఇనుము, వ్యర్థ పదార్థాలతో తక్కువ ఖర్చుతో ఈ-వాహనాన్ని తీర్చిదిద్దగా.. అదే ట్రేడ్‌‌కు చెందిన పులిపాటి పార్థసారథి గిరిజన, గనుల ప్రాంతాల అవసరాలకు తగినట్లు డ్యూయల్ పర్పస్ ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపొందించారు.

పనికిరావని పారేసిన స్క్రాప్ మెటీరియల్, పాత బైక్‌‌ల విడిభాగాలను వినియోగించి ఆడపా స్ఫూర్తి.. రూ.45 వేల వ్యయంతో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్‌‌ను సిద్ధం చేశారు. 48 వోల్ట్ 750 వాట్ల బీఎల్‌‌డీసీ మోటార్, నాలుగు లీడ్ యాసిడ్ బ్యాటరీలు, డీసీ కన్వర్టర్, ప్రొపెల్లర్ షాఫ్ట్, డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్‌‌ను అమర్చి కాలుష్య రహితంగా నడిచేలా దీనిని రూపొందించారు. ఈ వాహనం రూపకల్పనలో ఫ్యాబ్రికేషన్, వెల్డింగ్, వైరింగ్, బ్యాటరీ మేనేజ్‌‌మెంట్ వంటి అంశాలను స్వయంగా నేర్చుకున్నట్లు ఆమె తెలిపారు.

ప్రాంగణాల పరిధిలో అంతర్గత రవాణాకు, పరిశ్రమల్లో తేలికపాటి సరుకుల తరలింపునకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు. ఈ ఆవిష్కరణలో ప్రాజెక్టు ఖర్చును సాధ్యమైనంత తగ్గించడంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు స్ఫూర్తి వెల్లడించారు. వాహనం బరువు, మోటార్ పనిచేసే సామర్థ్యం, బ్యాటరీ అమరిక విధానం, భద్రతా ప్రమాణాలను స్వయంగా అధ్యయనం చేసి రూపకల్పన చేశామని, లోపాలను సరిదిద్దుకునే క్రమంలో ప్రాక్టికల్ ట్రబుల్ షూటింగ్ లోతుగా అర్థమైందని ఆమె పేర్కొన్నారు.

డ్యూయల్ పర్పస్ ఫోర్ వీలర్‌

మరో విద్యార్థి పులిపాటి పార్థసారథి ప్రయాణికులతో పాటు సరుకులను ఒకేసారి తరలించే వెసులుబాటుతో రూ.1.65 లక్షల ఖర్చుతో డ్యూయల్ పర్పస్ ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్‌‌ను ఆవిష్కరించారు. లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్, 48 వోల్ట్ 1250 వాట్ల బీఎల్‌‌డీసీ మోటార్, 50 యాంపియర్ కంట్రోలర్, స్టీరింగ్ ర్యాక్, డిఫరెన్షియల్ సిస్టమ్‌‌లతో బలమైన చాసిస్‌‌ను సిద్ధం చేశారు. గిరిజన గ్రామాలు, గనుల ప్రాంతాల్లో ఉండే రహదారి పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసిన ఈ వాహనంతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని, ఛార్జింగ్ కూడా వేగంగా అవుతుందని పార్థసారథి తెలిపారు.

సాధారణంగా ఏజెన్సీ, గనుల ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు పరిమితంగా ఉంటాయని, అందుకే ప్రజల రాకపోకలతో పాటు సరుకుల తరలింపునకు ఉపయోగపడేలా దీనిని తీర్చిదిద్దినట్లు పార్థసారథి వివరించారు. వాహనం తయారీ అనంతరం లోడ్ మోసే సామర్థ్యం, వేగం, బ్రేకింగ్ వ్యవహారం, బ్యాటరీ పనితీరుపై పలు దఫాలుగా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఏటీసీల్లో ఆధునిక యంత్రాలు, ప్రాజెక్టు ఆధారిత శిక్షణ విధానం అందుబాటులోకి రావడంతోనే పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు ప్రయోగాలు చేయడం సాధ్యపడుతోందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.