- లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణకూ చోటు దక్కలే
- ఏపీకి మూడు పోస్టులు.. మనకు మాత్రం సున్నా
- మిషన్ తెలంగాణపై పార్టీలో అయోమయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అధికారమే లక్ష్యమని, ‘మిషన్ తెలంగాణ’ పేరుతో హడావుడి చేస్తున్న బీజేపీ హైకమాండ్.. పదవుల పంపిణీలో మాత్రం రాష్ట్ర నేతలకు బిగ్ షాక్ ఇచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించిన కొత్త టీమ్‌లో తెలంగాణకు కనీసం ఒక్కటంటే ఒక్క పదవి కూడా దక్కలేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రకటించిన టీమ్‌లో తెలంగాణ నేతల పేరు ఎక్కడా కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు మిషన్ తెలంగాణ అంటూ 2028లో అధికారమే లక్ష్యమని చెబుతున్న హైకమాండ్.. కీలకమైన జాతీయ కమిటీలో మాత్రం రాష్ట్రానికి ప్రాతినిధ్యం లేకుండా చేయడంపై సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
పాతవారికి కోత.. కొత్తవారికి నో చాన్స్..
ఇప్పటివరకు జాతీయ స్థాయిలో కీలక భూమిక పోషించిన ముగ్గురు సీనియర్ నేతలకు ఈసారి నిరాశే ఎదురైంది. గతంలో పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలి హోదాలో ఉన్న డీకే అరుణలకు కొత్త టీమ్‌లో చోటు కల్పించలేదు. వీరి స్థానంలో కనీసం కొత్తవారికైనా అవకాశం ఇస్తారని భావించినా.. హైకమాండ్ మాత్రం ఎవరినీ పరిగణనలోకి తీసుకోలేదు. తెలంగాణ నుంచి ముఖ్యమైన నేతల పేర్లను పంపించినా.. వాటిని పట్టించుకోలేదని సమాచారం. తెలంగాణను దక్షిణ భారత్‌లో పార్టీకి గేట్‌వేగా అభివర్ణించే జాతీయ నాయకత్వం.. పదవుల పంపిణీకి వచ్చేసరికి మొండిచేయి చూపడంపై కేడర్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఏపీకి మూడు పదవులు..
తెలంగాణ పరిస్థితి ఇలా ఉంటే.. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం హైకమాండ్ పెద్దపీట వేసింది. ఏపీ నుంచి ముగ్గురు నేతలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రాంమాధవ్, దగ్గుబాటి పురందేశ్వరికి జాతీయ ఉపాధ్యక్ష పదవుల పదవి ఇవ్వగా.. విష్ణువర్ధన్‌రెడ్డిని ఆల్ సెల్స్ జాయింట్ సెక్రటరీగా నియమించారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో పార్టీ బలంగా ఉందని, ఎంపీ సీట్లు కూడా ఎక్కువే వచ్చాయని ఇక్కడి నేతలు గుర్తు చేస్తున్నారు. అయినా సరే, ఏపీకి మూడు పదవులు ఇచ్చి తెలంగాణను విస్మరించడం వెనుక అసలు వ్యూహం ఏంటనే చర్చ మొదలైంది. ఇది తెలంగాణ నేతలను అవమానించడమేననీ పార్టీ కేడర్ అభిప్రాయపడుతోంది. బెంగాల్ వ్యూహాలు అమలు చేస్తామని, సంస్థాగతంగా బలోపేతం చేస్తామని చెబుతూనే.. జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం లేకుండా చేయడంపై మిషన్ తెలంగాణపై హైకమాండ్ సీరియస్‌గా ఉందా? లేక లైట్ తీసుకుందా?.. అనే
అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
