- ‘కుడా’ ఆధ్వర్యంలో మ్యూజికల్ గార్డెన్‍లో ఏర్పాటుకు అడుగులు
- రూ.40 లక్షల నిధులతో పనులు చేపట్టేలా ప్రతిపాదనలు
- రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటి పూర్తిస్థాయి గార్డెన్
వరంగల్, వెలుగు: వరంగల్ సిటీలో సౌండ్ గార్డెన్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. గ్రేటర్ వరంగల్‌లో ఇప్పటికే పబ్లిక్ గార్డెన్, చిల్డ్రన్స్ గార్డెన్, మ్యూజికల్ గార్డెన్, భద్రకాళి బండ్ వంటి టూరిజం కేంద్రాలను అభివృద్ధి చేయగా, సరికొత్తగా సౌండ్ గార్డెన్‌ను నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఆలోచన చేసింది.
ఇందుకు కావాల్సిన నిధులు ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. 20 ఏండ్ల తర్వాత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పునఃప్రారంభమైన మ్యూజికల్ గార్డెన్‌లోనే సౌండ్ గార్డెన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
రూ.40 లక్షలతో.. ఓరుగల్లులో తొలిసారి
రాష్ట్రంలో తొలి సౌండ్ గార్డెన్‌కు వరంగల్‌లోని పచ్చని మ్యూజికల్ గార్డెన్ వేదిక కానుంది. నగర జీవనశైలి, పోటీ ప్రపంచంలో పెద్దలు ఉద్యోగ, కుటుంబ టెన్షన్లు, పిల్లలు చదువుల ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో సౌండ్ గార్డెన్ వారికి ఆహ్లాదాన్ని, ప్రశాంతతను అందించేలా రూపొందించనున్నారు.
పూల మొక్కలు, పచ్చని పరిసరాల మధ్య ధ్వని తరంగాలతో కూడిన సౌండ్ థెరపీ ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించడంతోపాటు ప్రశాంతత కలిగించేలా దీనిని అభివృద్ధి చేయనున్నారు. మ్యూజికల్ గార్డెన్ సెకండ్ ఫేజ్ అభివృద్ధి పనుల్లో భాగంగానే సౌండ్ గార్డెన్‌ను ఏర్పాటు చేసేందుకు కుడా ఆఫీసర్లు రెడీ అవుతున్నారు.
రాళ్లు, ఇత్తడి, కలపతో మ్యూజిక్..
దేశంలో తొలిసారిగా కర్ణాటకలో 2017లో ‘హైటెక్ ఇంటరాక్టివ్ మ్యూజిక్ మ్యూజియం’ను ఏర్పాటు చేశారు. అనంతరం 2022లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఐఐఎంలోనూ అందుబాటులోకి తెచ్చారు. బెంగళూరులోని జేపీ నగర్ తదితర కొన్ని ప్రాంతాల్లోనూ సౌండ్ గార్డెన్లు ఉన్నాయి. తమిళనాడులోని ‘స్వరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అండ్ రీసెర్చ్ సెంటర్’ సౌండ్ గార్డెన్లకు అవసరమైన వాయిద్యాల తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందింది.
కలప, ప్రత్యేక రాళ్లు, గాజు, ఇత్తడి, అల్యూమినియం వంటి లోహాలు, మట్టి, సేంద్రియ పదార్థాలతోపాటు ప్రాసెస్ చేసిన వస్తువులతో వివిధ రకాల ధ్వనులు వచ్చేలా వాయిద్యాలను రూపొందిస్తారు. సందర్శకులు వాటిని స్వయంగా ఉపయోగించినప్పుడు వెలువడే శబ్దాలు, ప్రతిధ్వనులు కొత్త అనుభూతిని కలిగిస్తాయి.
ఆటిజం చిన్నారులకు వరం..
ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులకు ట్రీట్మెంట్ లో భాగంగా సౌండ్ థెరపీని ఉపయోగిస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు నెలకు గంట నుంచి గంటన్నరపాటు సౌండ్ థెరపీ అందించేందుకు దాదాపు రూ.20 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం
హైదరాబాద్ వంటి నగరాల్లోని ప్రైవేట్ సెంటర్లకు వెళ్తున్న వారికి స్థానికంగానే సౌండ్ థెరపీకి అనుకూలమైన వాతావరణం అందుబాటులోకి వస్తే ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది. వరంగల్‌లో సౌండ్ గార్డెన్ అందుబాటులోకి వస్తే ఆటిజం చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.
త్వరలో ఏర్పాటు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా వరంగల్సిటీలో రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలతో సౌండ్ గార్డెన్ ఏర్పాటు ఆలోచన చేశాం. దీనికి పచ్చని ఆహ్లాదకరమైన స్థలం అవసరమైన క్రమంలో 'కుడా' తరఫున రూ.6 కోట్ల 20 లక్షలతో పున:ప్రారంభించిన మ్యూజికల్ గార్డెన్ అనువుగా ఉంది. మ్యూజికల్ గార్డెన్ రెండోదఫా అభివృద్ధి పనుల్లోనే సౌండ్ గార్డెన్ ఏర్పాటుకు చొరవ తీసుకుంటాం.
- ఇనగాల వెంకట్రామిరెడ్డి (తాజా మాజీ కుడా చైర్మన్)
