- రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి నివేదిక
- అనుమతులు రాకపోవడంతో జైపూర్ ఎస్టీపీసీ ప్లాంట్‌లో ప్రారంభం కాని ఉత్పత్తి
కోల్‌బెల్ట్/ జైపూర్, వెలుగు:మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్(ఎస్టీపీపీ) ఆవరణలో కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్‌ను తయారు చేసే పైలట్ ప్రాజెక్టులో ఉత్పత్తి ప్రారంభం కావడం లేదు. ప్లాంట్‌లో ప్రయోగాత్మకంగా మిథనాల్ ఉత్పత్తి ట్రయల్ రన్ సక్సెస్ అయినప్పటికీ, పూర్తి స్థాయి నిర్వహణపై సింగరేణి యాజమాన్యం వేచి చూసే ధోరణిని అవలంభిస్తోంది.
రూ.20కోట్లతో నిర్మించిన ప్లాంట్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిథనాల్ ఉత్పత్తికి సంబంధించిన నివేదికలను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి పంపించి ఆరు నెలలు దాటుతున్నా, అక్కడి నుంచి ఏ సమాచారం రాకపోవడంతో ఎదురుచూపులు తప్పడంలేదు.
దేశంలో తొలి పైలట్ ప్రాజెక్టుగా..
సింగరేణిలో ఉత్పత్తి అయ్యే బొగ్గును మండించడం ద్వారా వెలువడే కార్బన్ డయాక్సైడ్ ఆధారంగా మిథనాల్ లిక్విడ్‌ను తయారుచేసేందుకు సింగరేణి యాజమాన్యం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 2021లో ప్రపోజల్స్ తయారు చేయగా, అనేకసార్లు రివ్యూ చేసిన అనంతరం 2024 నవంబర్ లోప్లాంట్ ను ఏర్పాటు చేశారు. కోలిండియా ఆధ్వర్యంలో సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇనిస్టిట్యూట్(సీఎంపీడీఐ) ఆర్థిక సహకారంతో రూ.20 కోట్ల అంచనాతో ఎస్టీపీపీలో ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
కోలిండియా పరిధిలో పలు రాష్ట్రాల్లో బొగ్గు ఉత్పత్తి సంస్థలు ఉన్నా, వీటిలో ఎస్టీపీపీ మాదిరిగా విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు లేకపోవడంతో సింగరేణిలోని ఎస్టీపీపీని ప్రయోగానికి ఎంచుకున్నారు. ప్రస్తుతం దేశీయ అవసరాల కోసం వినియోగిస్తున్న 120 మిలియన్ టన్నుల మిథనాల్‌లో 80 మిలియన్ టన్నుల వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
కార్బన్ డయాక్సైడ్ ఆధారంగా..
సింగరేణి ఎస్టీపీపీలో బొగ్గును మండించడం ద్వారా వెలువడే కార్బన్ డయాక్సైడ్ వాయువు ఆధారంగా మిథనాల్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. బొగ్గును మండించే సమయంలో కర్బన ఉద్గారాలు వాతావరణంలో కలవకుండా నివారించేందుకు ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్(ఈఎస్పీ)ను నెలకొల్పారు. దీంతో వాతావరణం కలుషితం కాకుండా చర్యలు చేపట్టారు.
ఇందుకోసం ఎస్టీపీపీ చిమ్నీకి అనుబంధంగా ప్లాంట్‌ను నిర్మించారు. ఈ విధానం ద్వారా ఉత్పత్తి అయ్యే కార్బన్ డయాక్సైడ్తో 150 నుంచి 180 కేజీల మిథనాల్ తయారు చేసే అవకాశం ఉంది.
బెంగుళూరు సంస్థకు బాధ్యతలు
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన మిథనాల్ ప్లాంట్ నిర్వహణ, మిథనాల్ ఉత్పత్తి తదితర బాధ్యతలను బెంగుళూరుకు చెందిన జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్(జేఎన్సీఏఎస్ఆర్)కు అప్పగించారు. 2024లో ప్లాంట్ పనులు పూర్తి కాగా, 2025 మార్చితో పాటు అదే ఏడాది అక్టోబర్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు పలు దశల్లో ప్రయోగాత్మకంగా మిథనాల్‌ను ఉత్పత్తి చేశారు.
ఇందులో లోపాలను గుర్తించి టార్గెట్ మేరకు ఉత్పత్తి సాధించే దిశగా చర్యలు చేపట్టారు. కార్బన్ డై ఆక్సైడ్ సేకరణ, హైడ్రోజన్ ఉత్పత్తి, కంప్రెషన్, మిథనాల్ డిస్టిలేషన్కు సంబంధించిన కొన్ని కీలక యంత్రాల విడిభాగాలు ఆలస్యంగా రావడంతో ప్లాంట్ పనుల్లో జాప్యం జరిగింది.
ప్రస్తుతం ప్లాంట్‌లో మిథనాల్ ఉత్పత్తి ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో నివేదికలను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి పంపారు. ఆరు నెలలు గడుస్తున్నా ప్లాంట్ పూర్తి స్థాయి నిర్వహణకు ఆదేశాలు రాలేదు. దీంతో ఎదురుచూపులు తప్పడం లేదు.
సింగరేణికి ప్రయోజనం
మిథనాల్‌ను ఎరువులు, అక్రిలిక్ ప్లాస్టిక్, సింథటిక్ ఫైబర్ వస్త్రాలు, ఫ్లైవుడ్, పెయింట్స్ తయారీలో వినియోగిస్తారు. ప్లాంట్‌లో తయారు చేసే మిథనాల్‌ను వివిధ పరిశ్రమలకు అమ్మడం ద్వారా సింగరేణికి ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం మార్కెట్లో మిథనాల్ స్వచ్ఛతను బట్టి కేజీకి రూ.200 నుంచి 300 వరకు పలుకుతోంది. ఎస్టీపీపీ ప్లాంట్ ద్వారా మిథనాల్ ఉత్పత్తి జరిగితే సింగరేణికి వ్యాపారపరంగా కలిసివస్తుందని చెబుతున్నారు.
