- రాంగ్‌రూట్ డ్రైవ్ చేస్తూ దొరికితే సీరియస్ యాక్షన్
- గూగుల్ మ్యాప్స్‌లో అప్డేట్
- సీసీ కెమెరాలు, డ్రోన్లు, హై రైజ్ కెమెరాలతో పర్యవేక్షణ
- వాకర్స్, విజిటర్స్ కోసం స్పెషల్ పార్కింగ్
- ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్
హైదరాబాద్ సిటీ, వెలుగు : కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న హెచ్‌సిటీ ప్రాజెక్టు పనుల్లో భాగంగా మంగళవారం నుంచి వన్ వే అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉదయం ఆరు గంటల నుంచి వన్ వే షురూ అవుతుందన్నారు. కీలక ప్రాంతాల్లో రోడ్ మార్కింగ్‌లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. వన్‌వే ఉందని, ఎవరైనా దగ్గరి దారి అంటూ రాంగ్సైడ్డ్రైవింగ్చేస్తే సీరియస్యాక్షన్తీసుకుంటామన్నారు. పార్క్ చుట్టూ వాహనాలు రాకపోకలను సీసీ కెమెరాలు, డ్రోన్లు, హై రైజ్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. అలాగే, పార్కుకు వచ్చే వాకర్స్ కోసం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని, సూచించిన ప్రాంతంలోనే విజిటర్స్ పార్కింగ్ చేసుకోవాలన్నారు.
గూగుల్ మ్యాప్ ఫాలో కండి
పార్కు చుట్టూ నిర్దిష్ట యూ-టర్న్‌లు, ఎగ్జిట్ పాయింట్లతో కూడిన కొత్త వన్-వే రూట్ మ్యాప్‌ను గూగుల్ మ్యాప్స్‌లో సవరించారు. ప్రయాణానికి ముందు దారి మార్పులను గూగుల్ మ్యాప్స్ ద్వారా సరిచూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.
13 ఎగ్జిట్ పాయింట్లు, 10 లైన్ ఛేంజర్లు
వాహనదారులు ఇబ్బందులు పడకుండా వన్-వే లూప్ నుంచి బయటకు వెళ్లి ఇతర ప్రధాన రహదారుల్లోకి ప్రవేశించడానికి 13 ఎగ్జిట్ పాయింట్లు, 10 లైన్ఛేంజర్లు ఏర్పాటు చేశారు. చుట్టూ ప్రయాణించేటప్పుడు దారి మారడానికి కేవలం ఈ 10 ప్రాంతాల్లో మాత్రమే అనుమతి ఉంటుంది. పార్క్ చుట్టూ ఏర్పాటు చేసిన సైన్బోర్డులను గమనిస్తూ, ఎగ్జిట్ అవ్వడానికి ముందే నిర్ణీత లేన్ ఛేంజర్స్ ద్వారా సరైన లైన్లోకి మారాలన్నారు. పార్క్‌చుట్టూ ఎక్కడా నేరుగా రైట్ టర్న్ తీసుకోవడానికి అనుమతి
లేదన్నారు.
మూడు షిఫ్టుల్లో పనులు
హైదరాబాద్ సిటీ : కేబీఆర్ పార్కు చుట్టూ చేపడుతున్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల పనులను వేగవంతం చేసేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. మంగళవారం నుంచి పార్కు చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రావడంతో పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు ప్లాన్చేశారు. ట్రాఫిక్ రద్దీకి ఇబ్బందులు కలగకుండా పనులు కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి,పగలు మూడు షిఫ్టుల్లో పనులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. పనుల పురోగతిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచనలు చేశారు. వన్ వే గురించి సమాచారం ఇస్తూ సోమవారం పార్కు చుట్టూ ప్లకార్డులు ప్రదర్శించారు.
నేరెడ్‌మెట్– వినాయక్ నగర్ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
మల్కాజ్‌గిరి : వాజ్‌పేయి నగర్ రైల్వే గేట్ వద్ద చేపట్టనున్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులు మంగళవారం నుంచి మొదలుకానుండడంతో పోలీసులు ట్రాఫిక్ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా నేరెడ్‌మెట్ ఎక్స్ రోడ్ నుంచి వినాయక్ నగర్ జంక్షన్, సఫిల్‌గూడ రూట్‌లో వెళ్లే వాహనాలకు రెండు మార్గాలను సూచించారు. మొదటిది -నేరెడ్‌మెట్ ఎక్స్ రోడ్డు నుంచి సైనిక్‌పురి, కెనరా బ్యాంక్ జంక్షన్, ఓల్డ్ సఫిల్‌గూడ, వినాయక్ నగర్ మీదుగా ఆనంద్‌బాగ్ వైపు వెళ్లడం కాగా, రెండోది వాయుపురి, కాకతీయ నగర్, నేరెడ్‌మెట్ పాత పీఎస్ సర్కిల్, వినాయక్ నగర్ మీదుగా ఆనంద్‌బాగ్‌కు చేరుకోవడం..అలాగే, సఫిల్‌గూడ, వినాయక్ నగర్ జంక్షన్ల నుంచి నేరెడ్‌మెట్ ఎక్స్ రోడ్ దిశగా వెళ్లే వాహనాలను ఓల్డ్ సఫీల్‌గూడలోని డి-మార్ట్ మీదుగా మళ్లించనున్నారు. వినాయక్ నగర్ డి-మార్ట్, ఓల్డ్ సఫిల్‌గూడ, కెనరా బ్యాంక్ జంక్షన్, సైనిక్‌పురి రూట్లేదా నేరెడ్‌మెట్ పాత పీఎస్ సర్కిల్, కాకతీయ నగర్, వాయుపురి మార్గం ద్వారా నేరెడ్‌మెట్ ఎక్స్ రోడ్‌కు చేరుకోవచ్చని వివరించారు.
ఉత్తమ్ నగర్‌లోనూ..
మల్కాజ్‌గిరి : మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పీఎస్పరిధిలోని ఉత్తమ్ నగర్ టీ -జంక్షన్ నుంచి ఏవోసీ రోడ్డు వరకు మంగళవారం నుంచి సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. ఉత్తమ్ నగర్ టీ -జంక్షన్ వద్ద ఆనంద్‌బాగ్ ఎక్స్ రోడ్, గౌతమ్ నగర్, మల్కాజ్‌గిరి వైపు నుంచి వచ్చే వాహనాలను ఏవోసీ జంక్షన్ వైపు అనుమతించరు. వీరు గౌతమ్ నగర్ రోడ్డు మీదుగా తుకారామ్ గేట్ మెయిన్ రోడ్డు, ఈస్ట్ మారేడ్‌పల్లి రోడ్డు మీదుగా ఏవోసీ జంక్షన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఏవోసీ జంక్షన్ నుంచి ఉత్తమ్ నగర్ టీ -జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను ఈస్ట్ మారేడ్‌పల్లి రోడ్డు వైపు మళ్లిస్తారు. ఈ వాహనాలు ఈస్ట్ మారేడ్‌పల్లి రోడ్డు, తుకారామ్ గేట్ మెయిన్ రోడ్డు, గౌతమ్ నగర్ రోడ్డు మీదుగా ఉత్తమ్ నగర్ టీ -జంక్షన్ చేరుకోవాలి.
ఐటీ కారిడార్ యూటర్న్‌లపై ఫోకస్ ఆకస్మికంగా పర్యటించిన జాయింట్ సీపీ
గచ్చిబౌలి, వెలుగు : ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్సమస్యలపై పోలీసు ఉన్నతాధికారులు ఫోకస్‌పెట్టారు. ఈ నేపథ్యంలో సైబారాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ సోమవారం ఖాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, మల్కంచెరువు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీ చేసి వాహనాల రద్దీ, ట్రాఫిక్‌ను పరిశీలించారు. ఖాజాగూడలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రతిపాదిత నూతన యూ-టర్న్ ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు, స్థానికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఖాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద ప్రస్తుతం ఉన్న పాత యూ-టర్న్‌ను పూర్తిగా మూసివేసి, సుమారు 70 మీటర్ల ముందుగా కొత్త యూ-టర్న్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, వాహనదారులు రాంగ్ రూట్‌లో ప్రయాణించడాన్ని పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు. తర్వాత మల్కంచెరువు వెనుక వైపు ఉన్న హైటెన్షన్ రోడ్డును సందర్శించి ట్రాఫిక్ రద్దీని సమీక్షించారు. తక్కువ దూరంలోనే రెండు యూ-టర్న్‌లు ఉండటం వల్ల వాహనాల రాకపోకల్లో గందరగోళం ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని గుర్తించి, ఆ రెండు యూ-టర్న్‌లను మూసివేయాలని ఆదేశించారు.
లైన్ చేంజర్లు ఇవే..
1. టీజీ స్టడీ సర్కిల్ భవన్
2. బీఆర్‌ఎస్ భవన్
3. ఒమెగా హాస్పిటల్
4. జానారెడ్డి ఇంటి పరిసరాలు
5. అపోలో క్రెడిల్
6. తాజ్ మహల్ హోటల్ పరిసరాలు
7. ఫీనిక్స్ బిల్డింగ్ రోడ్
8. రోడ్ నెంబర్ 65
9. మంత్రి టవర్స్,
10. క్రీమ్ స్టోన్ ఐస్‌క్రీమ్ పార్లర్
13 ఎగ్జిట్ పాయింట్స్
1) జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్
2) కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్
3) మహారాజా అగ్రసేన్ జంక్షన్
4) రోడ్ నంబర్ 45 జంక్షన్
5) ఫిలింనగర్ కూడలి
6) ఎన్టీఆర్ భవన్ /
పంజాగుట్ట వైపు వెళ్లే మార్గం
7) బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్
8) రోడ్ నంబర్ 12 బంజారాహిల్స్ వైపు
9) రోడ్ నంబర్ 36 జూబ్లీహిల్స్ వైపు
10) యూసుఫ్‌గూడ / కృష్ణానగర్ వైపు
11) మాదాపూర్ / సైబర్ టవర్స్ వైపు
12) కేబుల్ బ్రిడ్జ్ వైపు
13) జర్నలిస్ట్ కాలనీ వైపు..
