డ్రగ్స్ కేసులో తాను నిర్దోషినని బెంగళూరు కోర్టు తనపై ఉన్న కేసు కొట్టేసిందని నటి హేమ తెలిపారు. ఓ వీడియో రిలీజ్ చేసిన హేమ.. డ్రగ్స్ కేసులో2025 నవంబర్ 3 న కోర్టు జడ్జిమెంట్ వచ్చిందని.. అయితే ఇప్పుడు జడ్జిమెంట్ కాపీ తన చేతికి రావడంతో క్లారిటీ ఇస్తున్నానని చెప్పారు. సోషల్ మీడియాలో తనపై తెగ దుష్ప్రచారం చేశారని.. ఆ బాధతో తన అమ్మ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు నటి హేమ. సోషల్ మీడియాలో తనపై జరిగిన దుర్మార్గపు ప్రచారానికి ఏడాదిన్నరగా తాను నరకయాతన అనుభవిస్తున్నానని చెప్పారు . తాను కాదని చెప్పినా కుడా కొందరు అసత్య ప్రచారాలు చేశారని.. ఎట్టకేలకు తాను నిర్దోషినని కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు హేమ.
88 మందిపై అభియోగాలు
2024 మే 19న రాత్రి బెంగళూర్ ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో లిక్కర్, డ్రగ్స్, గంజాయితో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారనే సమాచారంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 20వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో దాడులు చేశారు. ఈ కేసులో 9 మంది నిర్వాహకులు సహా 88 మందిపై అభియోగాలు మోపారు. హేమ సహా 79 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు స్థానిక కోర్టులో 1086 పేజీల చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
హేమకు కోర్టులో ఊరట
ఈ క్రమంలో నటి హేమ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుందని ఆరోపణలు చేస్తూ పోలీసులు ఎన్‌డిపిఎస్ చట్టంలోని సెక్షన్ 27 (బి) క్రింద కేసు నమోదు చేశారు. కానీ నటి హేమ మాత్రం తాను ఎలాంటి మత్తు మందు పదార్థాలు తీసుకోలేదని పలుమార్లు మీడియా ముందుకు వచ్చి మొరపెట్టుకుంది. అలాగే పోలీసుల విచారణలో తెలిపింది అయితే జనవరి 2,2025న హేమ కేసుని బెంగళూరు కోర్టు పరిశీలించింది. ఇందులో నటి హేమ తరుపు న్యాయవాది తన క్లైంట్ రేవ్ పార్టీలో ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని కోర్టుకు తెలిపాడు. అలాగే ఇప్పటివరకూ డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలలో కూడా నెగిటివ్ వచ్చిందని కాబట్టి ఆమెపై నమోదు చేసిన కేసు, ఛార్జ్ షీట్ కొట్టివేయాలని వాదించాడు. దీంతో కోర్టు నటి హేమకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇందులోభాగంగా తదుపరి విచారణ వాయిదా వరకూ నటి హేమపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశాలు జరీ చేసింది. ఈ క్రమంలో కోర్టు జడ్జిమెంట్ తన చేతికి రావడంతో హేమ వీడియో రిలీజ్ చేసి చెప్పారు.
