రూ.150 దిశగా కిలో టమాటా.. చూడటమే.. కొనటం లేదూ..

 రూ.150 దిశగా కిలో టమాటా.. చూడటమే.. కొనటం లేదూ..

టమాటా ధరలు భారీగా పెరిగిపోయాయి. మొన్నటివరకు కిలో రూ.30, రూ.40గా పలికిన ధర ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎగబాకింది. ఇటీవల కురిసిన వర్షాలకు టమాటా తోటలు దెబ్బతిని దిగుబడి తగ్గింది. తద్వారా 10 రోజులుగా ధరలు ఏ మాత్రం తగ్గకపోగా.. పైపెచ్చు పెరుగుతున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటుగా పలు రాష్ట్రాల్లో ధర రూ. 80 నుంచి రూ. 100 పలుకుతోంది.  

రానున్న రోజుల్లో టమాటా కిలో రూ.150కి చేరుకోవచ్చని కూరగాయల వ్యాపారులు అంచనా వేస్తున్నారు. పెరిగినే రేట్లకే ప్రజలు టమాట వైపు చూడాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.  ఇప్పుడు మళ్లీ పెరిగితే  సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు టమాట కొనుగోలు చేయడం కష్టసాధ్యంగా మారవచ్చు.  

మొన్నటివరకు  టమాటా కిలో రూ.40 మాత్రమే ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో అయితే టమాటా రెండు కిలోలు రూ.10 విక్రయించారు. మిగతా కూరగాయల ధరలు కూడా పదిరోజుల క్రితం కిలో రూ.30 నుంచి రూ.40 వరకు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం వాటి ధరలు కూడా రెండింతలు కావడంతో సామాన్యులు కూరగాయలు కొనలేని పరిస్థితి ఏర్పడింది.

టమాటానే కాకుండా ఇతర కూరగాయలైన బెండ, కాకర, దొండ, వంకాయ, దోస, బీర, ఆలుగడ్డ, మునగ, గోకరతో పాటుగా ఆకుకూరలు ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో కూరగాయలు కొనలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

మరోవైపు ధరలు భారీగా పెరగడంతో రైతులు అనందపడుతున్నారు.  పండించిన పంటకు గిట్టుబాట ధర లభిస్తుందని సంతోషిస్తున్నారు.  ఈ ఏడాదిలో ఇలాంటి ధరలు రావడం ఆనందంగా ఉంటుందంటున్నారు.