భారతీయ మెట్రో నగరాల్లో ప్రయాణం అంటేనే ఒక పెద్ద సాహసంగా మారిపోయింది. గంటల తరబడి ట్రాఫిక్ గ్రిడ్‌లాక్స్‌లో చిక్కుకుపోవడం వల్ల వాహనదారులు ఏడాదికి ఏకంగా ఒక వారం రోజుల సమయాన్ని కేవలం రోడ్ల మీద ట్రాఫిక్‌లోనే వృథా చేస్తున్నారని తాజా స్టడీలో వెల్లడైంది. నెదర్లాండ్స్‌కు చెందిన లొకేషన్ టెక్నాలజీ సంస్థ టామ్‌టామ్(TomTom) విడుదల చేసిన 2025 మొబిలిటీ డేటా ప్రకారం.. ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల్లో ఇండియన్ సిటీలు అగ్రస్థానంలో నిలిచాయి. మెక్సికో సిటీ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండగా.. మన బెంగళూరు ప్రపంచ స్థాయిలోనే రెండో స్థానాన్ని దక్కించుకుని ట్రాఫిక్ నరకానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.
ట్రాఫిక్ రాజధానిగా బెంగళూరు..
ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరులో సగటు వెహికల్ ట్రావెల్ స్పీడ్ గంటకు కేవలం 16.6 కిలోమీటర్లుగా ఉంది. ఇక్కడ ఒక వాహనదారుడు కేవలం 4.2 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 15 నిమిషాల సమయం పడుతోంది. 2024లో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 34 నిమిషాల సమయం పట్టగా.. 2025 నాటికి పరిస్థితులు మరింతగా దిగజారి 36 నిమిషాలకు ట్రావెల్ టైం చేరుకుంది. ఫలితంగా బెంగళూరు వాసులు ఏడాదిలో సగటున 168 గంటలు.. అంటే సుమారు 7 రోజుల 40 నిమిషాల సమయాన్ని ట్రాఫిక్‌లోనే పోగొట్టుకుంటున్నారని తేలింది. ఆసియాలోని టాప్-10 రద్దీ నగరాల్లో భారత్ నుంచి బెంగళూరు, పూణే, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, జైపూర్ చోటు సంపాదించుకోవడం గమనార్హం.
మెరుగుపడుతున్న ముంబై..
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ట్రాఫిక్ రద్దీ గత ఏడాదితో పోలిస్తే 3.3 శాతం తగ్గడం విశేషం. అయినప్పటికీ ముంబైకర్లు ఏడాదికి 126 గంటల సమయాన్ని రోడ్ల మీద వృథా చేస్తున్నారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ కష్టాలు 3.5 శాతం మేర పెరిగాయి. ఇక్కడి వాహనదారులు ఏటా 104 గంటలు ట్రాఫిక్ జామ్స్‌లో గడుపుతున్నారు. కోల్‌కతా 2024లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండగా.. 2025 నాటికి 29వ స్థానానికి మెరుగుపడటం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు.
హైదరాబాద్ పరిస్థితి ఇలా..
భారీ ట్రాఫిక్ కష్టాల మధ్య హైదరాబాద్ నగరంలో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని నివేదిక చెప్పింది. ఆసియా ఖండంలో రద్దీ పరంగా హైదరాబాద్ 15వ స్థానంలో నిలిచింది. మన దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో ట్రాఫిక్ రద్దీ 1.3 శాతం మేర తగ్గిందట. మిగిలిన నగరాల్లో రద్దీ పెరుగుతుంటే.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తగ్గుదల నమోదు కావడం ఇక్కడి రవాణా ఇన్ ఫ్రా మెరుగుదల, మెరుగైన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌ను సూచిస్తోంది. ప్రపంచ ర్యాంకింగ్‌లో హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీ పరంగా 47వ స్థానంలో నిలవగా.. 2వ స్థానంలో ఉన్న బెంగళూరు , 5వ స్థానంలో ఉన్న పూణే నగరాల కంటే చాలా మెరుగ్గా ఉంది.
టామ్‌టామ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.65 ట్రిలియన్ కిలోమీటర్ల మేర సేకరించిన జీపీఎస్ డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. భారతీయ నగరాల్లో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా బెంగళూరు, పూణే వంటి నగరాల్లో ఐటీ ఉద్యోగులు ట్రాఫిక్ వల్ల సమయాన్ని కోల్పోతుండటం ప్రొడక్టివిటీని దెబ్బతీస్తోందని, హైదరాబాద్ వంటి నగరాలు ఇదే బాటలో సానుకూల మార్పులను కొనసాగించాల్సి ఉందని సూచిస్తోంది.
