
- ఇన్‌ఫ్లేషన్ నెంబర్లపై ఇన్వెస్టర్ల దృష్టి
- పాజిటివ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. కొనుగోలుదారులుగా ఎఫ్‌ఐఐలు
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఈ వారం ఇండియన్ స్టాక్ మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు అమెరికా, చైనా మధ్య టారిఫ్‌లకు సంబంధించి ట్రేడ్ టాక్స్ నడుస్తున్నాయి. ఇది కూడా సానుకూల పరిణామం. మరోవైపు దేశ మాక్రో ఎకనామిక్ డేటా ప్రకటనలు, కంపెనీల క్యూ4 రిజల్ట్స్, విదేశీ ఇన్వెస్టర్ల కదలికలు, గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ కూడా ఈ వారం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని ఎనలిస్టులు చెబుతున్నారు. " భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ మెరుగుపడుతుంది. ఫైనాన్షియల్ మార్కెట్లకు ఇది పెద్ద సానుకూల పరిణామం. గతంలో ఇలాంటి జియోపొలిటికల్ డీ-ఎస్కలేషన్స్ తర్వాత మార్కెట్లు తమ నష్టాల నుంచి రికవర్ అయ్యాయి" అని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వీపీ (రీసెర్చ్) ప్రశాంత్ తపసే అన్నారు.
గత రెండు వారాలుగా నెట్ బయర్స్‌గా ఉన్న ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎఫ్‌ఐఐలు) శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో అమ్మకందారులుగా మారారని, వీరిపై అందరి దృష్టి ఉంటుందని ఆయన చెప్పారు. దీంతో పాటు ఈ వారం ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ( సీపీఐ) (ఈ నెల12న) , హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) (ఈ నెల14న), ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ డేటా వెలువడనున్నాయి. టాటా స్టీల్, భారతి ఎయిర్‌టెల్, గెయిల్, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, లూపిన్, భెల్ వంటి పలు పెద్ద కంపెనీలు తమ క్వార్టర్లీ రిజల్ట్స్‌ను ప్రకటించనున్నాయి. గత వారం సెన్సెక్స్ 1,047.52 పాయింట్లు లేదా 1.30 శాతం నష్టపోగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 338.7 పాయింట్లు లేదా 1.39 శాతం తగ్గింది.
ఎఫ్‌ఐఐలు రూ.14,167 కోట్ల పెట్టుబడులు
ఎఫ్‌ఐఐలు ఇండియా ఈక్విటీ మార్కెట్‌లో నికర కొనుగోలుదారులుగా కొనసాగుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు నికరంగా రూ. 14,167 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్‌గా ఉండడం, ఫండమెంటల్‌గా ఇండియా బలంగా ఉండడంతో పెట్టుబడులు పెడుతున్నారు.