బూత్ స్థాయిలో బలపడితే మళ్లీ కాంగ్రెస్ దే అధికారం: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

బూత్ స్థాయిలో బలపడితే మళ్లీ కాంగ్రెస్ దే అధికారం: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

గ్రామ, బూత్ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతమైతే, వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. 

కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నూతన డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఏ చిన్న పదవి దక్కినా, అది భవిష్యత్తుకు బలమైన పునాది అని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను బూత్ స్థాయి నుంచే ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. దేశంలోనే మొదటిసారిగా కుల సర్వే చేపట్టిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని.. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందంటే దానికి కారణం కాంగ్రెస్ చేపట్టిన కుల సర్వేనే అని ఆయన గుర్తు చేశారు. 

కేసీఆర్ గతంలో వరి వేస్తే ఉరి అన్నారని.. కానీ నేడు కాంగ్రెస్ హయాంలో దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే 80 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు, ఉచిత కరెంట్, పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని.. కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపారని ఆయన వెల్లడించారు.

కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాల్జేసి వెళ్లినా.. తాము ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తూ సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మడం లేదని, అందుకే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 52 శాతం సీట్లు ఇచ్చి, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో 70 శాతానికి పైగా స్థానాలు గెలుచుకున్నామని గుర్తు చేశారు. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, దానిని విస్మరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ పాలన కేవలం కార్పొరేట్ల కోసమేనని.. పేదవాడిపై పెట్రోల్ భారం మోపి, అన్ని ధరలనూ పెంచేసిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మొలకెత్తే ప్రసక్తే లేదని మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు. పదవి అనేది బాధ్యతని, నాయకులంతా నిరంతరం ప్రజల్లో ఉంటూ కష్టపడాలని.. పార్టీ అందరినీ గుర్తిస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు