కాంగ్రెస్​ నేతలు మరుగుజ్జులైతే.. కేసీఆర్, కేటీఆర్ ​బాహుబలులా : రేవంత్​ రెడ్డి

కాంగ్రెస్​ నేతలు మరుగుజ్జులైతే.. కేసీఆర్, కేటీఆర్ ​బాహుబలులా : రేవంత్​ రెడ్డి
  • కల్వకుంట్ల ఫ్యామిలీతో ఊచలు లెక్కబెట్టిస్తాం
  • వాళ్ల రాజకీయ జీవితం సోనియా వేసిన బిచ్చం అని కామెంట్ 
  • ఢిల్లీలో కాంగ్రెస్​లో చేరిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కసిరెడ్డి
  • 45 రోజుల్లో మరుగుజ్జులెవరో, ప్రజల మనుషులెవరో తేల్తది: రేవంత్

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ నేతల్ని మరుగుజ్జులని విమర్శిస్తున్న కేటీఆర్, కేసీఆర్ ఏమైనా బాహుబలులా అని టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు. రాబోయే 45 రోజుల్లో మరుగుజ్జులెవరో, ప్రజల మనుషులెవరో తేలిపోతుందన్నారు. పోలింగ్ అయిన మరుక్షణం పారిపోయేందుకు కల్వకుంట్ల ఫ్యామిలీ సిద్ధంగా ఉందని, కానీ ఊచలు లెక్కబెట్టిస్తామని రేవంత్​హెచ్చరించారు. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య కూటమి ఏర్పడిందని రేవంత్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీ తన ఓటు బ్యాంక్ ను బీఆర్ఎస్ కు బదిలీ చేస్తోందన్నారు. తన దోస్త్ కేసీఆర్ ను గెలిపించేందుకే ప్రధాని మోడి పదే పదే తెలంగాణకు వస్తున్నారని ఆరోపించారు. 

అసెంబ్లీ స్థానాల్లో వేరుగా పోటీ చేసి, లోక్ సభ ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసే బరిలో ఉంటాయన్నారు. మొత్తం17 లోక్ సభ స్థానాల్లో.. బీజేపి 7, బీఆర్ఎస్ 9, ఒక సీట్ లో ఎంఐఎం పోటీ చేయనుందన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలపై వస్తున్న అన్ని సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ 25 సీట్ల లోపు, బీజేపీ 5 సీట్ల లోపు, ఎంఐఎం 6 సీట్లకు పరిమితం అవుతుందన్నారు. మొత్తం కూటమికి కలిసి 36 సీట్లు వస్తే... మిగిలినవి కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. 

ఆయన వెంట నాగర్ కర్నూల్ జిల్లా వైస్ చైర్మన్ బాలా సింగ్, కల్వకుర్తికి చెందిన ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాజాజీ మార్గ్10లో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్, టీపీసీసీ చీఫ్ రేవంత్, సీడబ్ల్యూసీ మెంబర్ వంశీ చందర్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కసిరెడ్డి మాట్లాడుతూ.. కల్వకుర్తి ప్రాజెక్టుతో చుక్కా నీరు పారలేదన్నారు. ఆ ప్రాజెక్ట్ కింద భూములు పోయి,నీళ్లు రాక, రైతుబంధు అందక రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అధికార పార్టీలో ఎమ్మెల్సీ పదవిలో ఉండి కూడా కల్వకుర్తి ప్రాంతానికి ఏమీ చేయలేకపోయానన్నారు.  తప్పనిసరి పరిస్థితుల్లో, ప్రజల అభిష్టం మేరకు పార్టీని వీడాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. 

మీరేమన్న బాహుబలిలా?

చేరికల అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ అవసరాల దృష్ట్యా వంశీచందర్ రెడ్డి తన కల్వకుర్తి సీటును కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో బిల్లా, రంగాలు తిరుగుతున్నారంటూ హరీష్ రావు, కేటీఆర్ లపై విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం, ధరణి పేరుతో లక్ష కోట్లు, 10 వేల ఎకరాల భూమిని దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల్ని మరుగుజ్జులని విమర్శిస్తున్న కేటీఆర్, కేసీఆర్ ఏమైనా బాహుబలిలా అని ప్రశ్నించారు. రాబోయే 45 రోజుల్లో మరుగుజ్జులెవరో, ప్రజల మనుషులెవరో తేలిపోతుందన్నారు. పోలింగ్ అయిన మరుక్షణం పారిపోయేందుకు బిల్లా, రంగాల ఫ్యామిలీ సిద్ధంగా ఉందని, కానీ ఊచలు లెక్కబెట్టిస్తామని హెచ్చరించారు. 

సోనియా గాంధీ వేసిన బిచ్చం...

ప్రస్తుతం కల్వకుంట్ల కుటుంబం దగ్గర ఉన్న సిరి సంపదలు, విలాసవంతమైన జీవితం సోనియా గాంధీ వేసిన బిచ్చమని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ కు యూత్ కాంగ్రెస్ లో అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. సోనియా గాంధీ బిచ్చమేస్తేనే ఎమ్మెల్యే కాకుండానే హరీష్ రావు మంత్రి అయ్యారన్నారు. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంలో రూ.100 కోట్లకు టెండర్లు పిలిచి రూ. 200 కోట్లు చేశారన్నారు. రూ. 64 వేల కోట్లతో టెండర్లు పిలి చిన అమరవీరుల స్థూపం రూ. 200 కోట్లు అయిందన్నారు. రూ. 4 వందల కోట్లతో నిర్మిస్తామన్న సచివాలయం రూ.1400 కోట్లకు చేశారన్నారు. కేసీఆర్ లాంటి నీచులు తెలంగాణ సమాజంలోనే లేరని విమర్శించారు. ‘‘కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయ డం లేదని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. మరి సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ లో బీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న స్కీంలను తెలంగాణలో అంతటా ఎందుకు అమలు చెయ్యడం లేదు’ అని రేవంత్​ ప్రశ్నించారు. 

కేసీఆర్​తోనే తెలంగాణ అన్యాయం...

ప్రస్తుతం తెలంగాణకు ఏదైనా అన్యాయం జరిగిందంటే అందుకు కేసీఆరే కారణమని రేవంత్​అన్నారు. 60 ఏండ్లలో తాము చేసిన అప్పు రూ. 69 వేల కోట్లు అయితే, 9 ఏండ్లలో కేసీఆర్ చేసిన అప్పు రూ. 5.50 లక్షల కోట్లు అన్నారు. మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని అప్పగిస్తే.. లక్షల కోట్ల లోటు బడ్జెట్ తో తెలంగాణ మునిగిపోయిందన్నారు. తెలంగాణలో యూపీఏ1, యూపీఏ 2 (2004–14) వరకు కాంగ్రెస్ పాలన, బీఆర్ఎస్ పదేండ్ల పాలన(2014–24) పాలన తీరుపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ కంటే, బీఆర్ఎస్ పాలన భేష్ అని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు.