బీజేపీ, బీఆర్ఎస్ అవిభక్త కవలలు: రేవంత్ రెడ్డి

బీజేపీ, బీఆర్ఎస్ అవిభక్త కవలలు: రేవంత్ రెడ్డి

బీజేపీ, బీఆర్ఎస్పై టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ అవిభక్త కవలలని.. నాణేనికి బొమ్మా బొరుసు లాంటివని రేవంత్రెడ్డి విమర్శించారు. దేశ సంపదను మోదీ మిత్రులకు దోచిపెడుతుంటే.. రాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబానికి దోచి పెడుతున్నారని రేవంత్ విమర్శించారు. 

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడింది కాంగ్రెస్ అయితే బ్రిటీష్ పాలకుల్లా.. విభజించు పాలించు విధానాన్ని అమలు చేస్తున్న చరిత్ర బీజేపీదని రేవంత్రెడ్డి  ఆరోపించారు. అందుకు మణిపూర్ ఘటనే నిదర్శనమని తెలిపారు. అసెంబ్లీలో మణిపూర్ ఇష్యూపై పల్లెత్తి మాట మాట్లాడని బీఆర్ఎస్.. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కాంగ్రెస్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

ఇవాళ (ఆగస్టు 20) స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజిగూడలో ఆయన విగ్రహానికి పూల మాల వేసి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్. మాజీ మంత్రి అంజనీకుమార్ నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ అని.. ప్రధానిగా నెహ్రు .. హరితవిప్లవం, పంచవర్ష ప్రణాళికలతో దేశ అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం, పేదలకు భూముల పట్టాలు ఇప్పించారని అన్నారు.  పాక్ పై యుద్ధం చేసి బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం సాధించి పెట్టిందని రేవంత్ అన్నారు. 

రాజీవ్ గాంధీ యువతకు ఓటు హక్కు కల్పించారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 73,74 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి గ్రామపంచాయతీలకు సర్వ హక్కులు కల్పించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.రాజ్యాంగ సవరణల ద్వారా  సర్పంచ్, జడ్పీటీసి ఎంపీటీసి లను బలోపేతం చేశారని తెలిపారు. మహిళలకు స్థానిక సంస్థల్లో  50 % శాతం రిజర్వేషన్ తీసుకొచ్చారని రేవంత్ పేర్కొన్నారు. 

దేశానికి కంప్యూటర్ పరిచయం చేసి సాంకేతిక విప్లవం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ అని.. భారత్ ఏమాత్రం తక్కువ కాదు.. ప్రపంచ దేశాలకు ధీటుగా  గాంధీ కుటుంబం పాలన సాగించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర్యం కోసమే కాదు.. ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన ఘతన గాంధీ కుటుంబానిదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. 

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానేత రాజీవ్ గాంధీ అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ప్రతి యేటా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం.. రాజీవ్ వారసులు రాహుల్ గాంధీ నేతృత్వంలో ముందుకు సాగాలని జగ్గారెడ్డి కార్యక్తలను కోరారు.