ధరణి పోర్టల్తో కోటిన్నర ఎకరాలు ఆగమైనయ్ : రేవంత్ రెడ్డి

ధరణి పోర్టల్తో కోటిన్నర ఎకరాలు ఆగమైనయ్ : రేవంత్ రెడ్డి

ధరణి పోర్టల్తో కోటిన్నర ఎకరాలు ఆగమయ్యాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ను ప్రసన్నం చేసుకున్న ఓ ఏజెన్సీ ధరణి పోర్టల్ను నిర్వహిస్తుందన్నారు. రహస్యంగా ఉంచాల్సిన ఆస్తుల వివరాలు కేసీఆర్ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని మండిపడ్డారు. భూములున్నవారంత ఏకమై.. దీనిపై పోరాడాలని పిలుపునిచ్చారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు రైతు బంధు, సబ్సిడి విత్తనాలు, బ్యాంకు రుణాలు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
  
రైతు రుణమాఫీ చేయడంతోపాటు పోడు భూములకు పట్టాలివ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే కార్యచరణను ప్రకటించకపోతే ఈనెల 24 న ఎమ్మార్వో ఆఫీసుల వద్ద రైతులతో కలిసి కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపడతారని తెలిపారు. అదేవిధంగా 30న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో, డిసెంబర్ 5న కలెక్టరేట్ల ముందు నిరసన చేపడతామని వెల్లడించారు.

రాష్ట్రంలో రెండు పార్టీలు..లేని సమస్యలను సృష్టించి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. అభివృధ్దిని పక్కన పెట్టి రాజకీయం చేస్తున్నాయని.. టీఆర్ఎస్, బీజేపీ కుట్రలకు పెట్టుబడులు రావడం లేదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఎమ్మెల్యేల కొనుగోలు అంశంతో ప్రజాసమస్యలు పక్కదారి పడ్తున్నాయన్నారు. 8ఏళ్లుగా సీఎం ప్రజలకు దూరంగానే ఉంటున్నారని..రాష్ట్రంలో కనీసం సచివాలయం కూడా లేదని విమర్శించారు.