తెలంగాణ ప్రజల సొమ్ముతో ఇతర రాష్ట్రాలకు బీఆర్ఎస్​ను విస్తరణ : రేవంత్

తెలంగాణ ప్రజల సొమ్ముతో ఇతర రాష్ట్రాలకు బీఆర్ఎస్​ను విస్తరణ : రేవంత్

జయశంకర్​ భూపాలపల్లి/ములుగు, వెలుగు:  తెలంగాణ ప్రజలను వంచించి ఇక్కడి సొమ్ముతో బీఆర్ఎస్​ పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని కేసీఆర్​ చూస్తున్నారని, ఆయన్ను పాతాళానికి తొక్కడానికే ‘హాత్​ సే హాత్​ జోడో’ యాత్ర చేపట్టామని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అన్నారు. సోమవారం ములుగు జిల్లా మేడారం నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు. అంతకుముందు ములుగు గట్టమ్మ దేవాలయంలో , మేడారం సమ్మక్క సారలమ్మల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్ట్​ నగర్​ నుంచి అటవీ మార్గంలో 9 కి.మీ దూరం పాదయాత్ర చేశారు. అనంతరం గోవిందరావుపేట మండలం పస్రాలో జరిగిన రోడ్​షోలో మాట్లాడారు. కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్​ రావు ఠాక్రే, ప్రచార కమిటీ ప్రెసిడెంట్​ మధుయాష్కీ గౌడ్ ​రోడ్​షోలో పాల్గొన్నారు.  తెలంగాణలో సంపూర్ణమైన  మార్పు తెచ్చేందుకే  యాత్ర చేపట్టామని రేవంత్​ అన్నారు.  నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో జరగాలన్నా.. ఫీజు రీయింబర్స్​మెంట్​ డబ్బులు విద్యార్థులకు ఇవ్వాలన్నా.. ఆరోగ్య శ్రీ పథకం సజావుగా నడిపించాలన్నా కాంగ్రెస్​కు  ఓట్లేసి గెలిపించాలని కోరారు.

“ఫుల్​ బాటిల్​, వెయ్యి రూపాయల కోసం ఓటును అమ్ముకోవద్దు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలు తీరుతాయ్​”అని రేవంత్​ చెప్పారు. “రాచరికం మీద పోరాటం చేసిన సమ్మక్క సారలమ్మల స్ఫూర్తితో.. కేసీఆర్​ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి పోరాడుదాం. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేడారం నుంచి యాత్ర చేపట్టాం. ఏ కార్యక్రమం చేపట్టినా ఆడబిడ్డ  ఎదురు రావాలనుకుంటామని.. సీతక్కను మా  ఇంటి ఆడబిడ్డగా భావించి మేడారం నుంచి యాత్ర మొదలు పెట్టాను”అని వెల్లడించారు.  ముందస్తు ఎన్నికలు పిచ్చోడి చేతిలో రాయి లాంటివన్నారు.  రాష్ట్ర బడ్జెట్ పై  కేసీఆర్ ఎప్పుడూ అబద్ధాలే చెబుతారని, దీన్ని తాము  జీరో బడ్జెట్ గా  భావిస్తున్నామన్నారు.  కేసీఆర్ వచ్చాక బడ్జెట్ లో 30 శాతం లోటు వచ్చిందని, ప్రపంచంలో ఇంత లోటున్న బడ్జెట్ ఎవ్వరూ ప్రవేశపెట్టలేదన్నారు. గడిచిన పదేళ్లలో 25 లక్షల కోట్ల బడ్జెట్​ ప్రవేశపెడితే రాష్ట్రంలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 20 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరగాలని.. అలాంటిది ఆ డబ్బులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు.  

యాత్రను సక్సెస్​ చేయాలి:  మాణిక్​ రావు ఠాక్రే 

రేవంత్​ రెడ్డి  ప్రారంభించిన హాత్​ సే హాత్​ జోడో యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్​ రావు ఠాక్రే కోరారు.  రోడ్​ షోలో ఆయన మాట్లాడారు.  రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర విశేషాలను ఇంటింటికి తీసుకెళ్లాలని కోరారు. కాంగ్రెస్​పార్టీ ప్రచార కమిటీ చైర్మన్​ మధుయాష్కీ గౌడ్​ మాట్లాడుతూ సీఎం కేసీఆర్​ నాందేడ్​లో సభ పెట్టి ఎస్సారెస్పీ నీళ్లను ఎత్తిపోసుకోవాలని అనడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్​ కూతురు కవిత లిక్కర్​ స్కాంలో ఇరుక్కోవడం ఆ కుటుంబ అవినీతికి అద్దం పడుతోందన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్​ పార్టీ నాయకులంతా కలిసేఉన్నారన్నారు.   కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్​, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజ్​,  మాజీ ఎంపీ రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.