హోం ఐసొలేషన్ లో టీపీసీసీ చీఫ్

హోం ఐసొలేషన్ లో  టీపీసీసీ చీఫ్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. జ్వరంతో బాధపడుతున్న తాను టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనను కలిసిన వారందరు టెస్ట్ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం హోం ఐసొలేషన్ లో ఉన్నట్లు రేవంత్ తెలిపారు. 

ప్రజలను బీజేపీ, టీఆర్ఎస్ మోసం చేస్తున్నాయి

కాగా ఇవాళ ఉదయం ఫేస్ బుక్ లైవ్ లో టీఆర్ఎస్, బీజేపీపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మునుగోడు ప్రజలను మోసం చేయడానికి బీజేపీ, టీఆర్ఎస్ లు మరోసారి కుటిల యత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా వ్యక్తిగత దూషణలు, వివాదాలు చేస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయన్నారు. ఎన్నికల ముందు బీజేపీ ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్న ఆయన..విదేశాల నుంచి నల్లధనం  తెచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో  రూ. 15 లక్షలు జమ చేస్తామని మోసం చేశారన్నారు.  ప్రతియేటా 2  కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ హామీ ఏమైందని ప్రశ్నించారు.

పార్లమెంట్ లో తాను అడిగిన ప్రశ్న కు కేవలం  22 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారని రేవంత్ చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా.. నిరుద్యోగ సమస్యపై సరైన చర్యలు తీసుకోలేదన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగినా కూడా..వాటిని  నియంత్రించి పేదలను ఆదుకోలేదని రేవంత్ రెడ్డి చురకలంటించారు. మునుగోడు ఉప ఎన్నికకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం రూ. 5 వేల కోట్లు కేటాయిస్తే అక్కడి సమస్యలు తీరుతాయని చెప్పారు.