ఇయ్యాల ఖమ్మంకు రేవంత్

ఇయ్యాల ఖమ్మంకు రేవంత్

హైదరాబాద్, వెలుగు: పార్టీని రాష్ట్రంలో మరింత బలోపేతం చేసేందుకు, ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ప్రజలు కాంగ్రెస్​ వైపు చూసేలా ఖమ్మం బహిరంగం సభను భారీగా నిర్వహించే ప్రణాళికలు వేస్తున్నది. ఆదివారం సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభను ఖమ్మంలో ‘తెలంగాణ జన గర్జన’ పేరిట నిర్వహించనున్నారు. ఈ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతుండడం, అదే సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతుండడంతో రాష్ట్ర నాయకత్వం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. 

ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర ఇన్​చార్జి మాణిక్ రావ్ ఠాక్రే స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఖమ్మంలో పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నారు. డీసీసీ ఆఫీసులో డీసీసీ అధ్యక్షుడు, పార్టీ నేతలు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల చైర్మన్లతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.

సభ పొంగులేటిదా.. భట్టిదా!

సభకు సంబంధించి ఇటు పొంగులేటి వర్గం, అటు భట్టి వర్గం పోటాపోటీగా ఏర్పాట్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బుధవారం మాణిక్ రావ్ ఠాక్రే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాదయాత్రలో ఉన్న భట్టి దగ్గరకు వెళ్లి చర్చలు జరిపారు. చివరకు భట్టి సభలోనే పొంగులేటి చేరుతారని ఠాక్రే ప్రకటించారు. అయితే, ఈ విషయంలో రేవంత్​ వర్గం, భట్టి వర్గం మధ్య పోరు అన్న విధంగా వ్యవహారం నడిచిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

పార్టీలోని రేవంత్ వ్యతిరేక వర్గంలోని కొందరు నేతలు.. భట్టి సభను ఆసరాగా చేసుకుని పొంగులేటి సభకు బ్రేకులు వేశారన్న చర్చ నడుస్తున్నది. తద్వారా భట్టి వర్గం నేతలు రేవంత్​పై పైచేయి సాధించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రచారానికి చెక్ పెట్టి, సభను సక్సెస్ చేయడంపై పార్టీ నేతలంతా కలసికట్టుగా కృషి చేసేందుకే సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. పెద్ద సంఖ్యలో జన సమీకరణకూ కసరత్తులు చేస్తున్నారు.