27 మంది ఉపాధ్యక్షులు.. 69 మంది ప్రధాన కార్యదర్శలు..TPCC నూతన కార్యవర్గం ఇదే

27 మంది ఉపాధ్యక్షులు.. 69 మంది ప్రధాన కార్యదర్శలు..TPCC నూతన కార్యవర్గం ఇదే

హైదరాబాద్: టీపీసీసీ నూతన కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించింది. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీ పదవులను భర్తీ చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు సోమవారం (జూన్ 9) రాత్రి ఏఐసీసీ కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. 27 మంది ఉపాధ్యక్షులకు టీపీసీసీ కార్యవర్గంలో చోటు కల్పించారు. 69 మందిని టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. జనరల్ సెక్రటరీలుగా ఎమ్మెల్యేలు వెడ్మబొజ్జ, మట్టా రాగమయి, పర్నికా రెడ్డి నియమితులయ్యారు.

ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‎ ఛాన్స్ దక్కించుకున్నారు. టీపీసీసీ నూతన కార్యవర్గంలో ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు అవకాశం దక్కింది. టీపీసీసీ నూతన కార్యవర్గంలో అధిష్టానం సామాజిక న్యాయం పాటించింది. ఏకపక్షంగా కాకుండా అన్ని వర్గాలకు చోటు కల్పించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు లేకుండానే టీపీసీసీ కమిటీ ప్రకటించింది ఏఐసీసీ. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్‎కు భారీగా పోటీ ఉండటంతో ప్రస్తుతం ఈ నియామకాలను ఏఐసీసీ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

కాగా, తెలంగాణ పాలిటిక్స్‎లో మంత్రి వర్గ విస్తరణ, టీపీసీసీ నూతన కార్యవర్గం ఈ రెండు అంశాలు గత కొద్ది నెలలుగా పెండింగ్‎లో ఉన్న సంగతి తెలిసిందే. 15 నెలలుగా ఇవాళ, రేపు అంటూ ప్రచారం జరిగింది. జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాలు, సీనియార్టీ, లాయల్టీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మంత్రి వర్గ విస్తరణ, టీపీసీసీ నూతన కార్యవర్గం ఎంపికపై టీపీసీసీ, ఏఐసీసీ తీవ్ర కసరత్తు చేసింది. 

ఈ క్రమంలోనే 2025, జూన్ 8వ తేదీన మంత్రి వర్గ విస్తరణ చేపట్టింది ప్రభుత్వం. రాష్ట్ర కేబినెట్‎లోకి కొత్తగా ముగ్గురు మంత్రులను తీసుకున్నారు. ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి వర్గ విస్తరణ జరిగిన 24 గంటల్లోనే టీపీసీసీ నూతన కార్యవర్గాన్ని కూడా ప్రకటించింది ఏఐసీసీ. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం (జూన్ 9) ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. 

ఈ సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో దాదాపు గంటపాటు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి వర్గ విస్తరణ, టీపీసీసీ నూతన కార్యవర్గం, స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది. కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసిన నిమిషాల వ్యవధిలోనే ఏఐసీసీ టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది.