- ఖమ్మం జిల్లా మడుపల్లి, ఏపీలోని తాళ్లూరు మధ్య ప్రమాదం
మధిర, వెలుగు : కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో ఒకరు చనిపోగా, మరో 27 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఖమ్మం జిల్లా మడుపల్లి, ఏపీలోని తాళ్లూరు మధ్య శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మడుపల్లి గ్రామానికి చెందిన 32 మంది కూలీలు శుక్రవారం ఉదయం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం శివాపురం గ్రామంలో మిర్చి కోత పనులకు వెళ్లారు. పని ముగిసిన తర్వాత అందరూ కలిసి ట్రాక్టర్‌లో తిరుగు పయనం అయ్యారు. ఏపీలోని తాళ్లూరు, తెలంగాణలోని మడుపల్లి గ్రామాల మధ్యకు రాగానే... ముందు వెళ్తున్న ఆటోను ఓవర్ టేక్ చేసే క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గొయ్యిలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది.
ప్రమాదంలో మడుపల్లి గ్రామానికి చెందిన వేల్పుల అన్నపూర్ణ (52) అక్కడికక్కడే చనిపోగా.. మరో 27 మంది గాయపడ్డారు. వీరిలో రాధ, సుల్తానా పరిస్థితి విషమంగా ఉండడంతో వీరిని ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. మిగతా 25 మంది కూలీలకు స్వల్ప గాయాలు కావడంతో మధిర ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. మధిర టౌన్ సీఐ డి. రమేశ్, ఎస్సై కిశోర్‌కుమార్ ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో మడుపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

