వెజిటేరియ‌న్స్ కు గుడ్ న్యూస్: ప్ర‌స‌వంలో ఈ స‌మ‌స్య‌ల‌కు చెక్!

వెజిటేరియ‌న్స్ కు గుడ్ న్యూస్: ప్ర‌స‌వంలో ఈ స‌మ‌స్య‌ల‌కు చెక్!

మాతృత్వం పొంద‌డం ప్ర‌తి మ‌హిళ జీవితంలో ఓ మ‌ధుర ఘ‌ట్టం. గ‌ర్భం దాల్చిన ద‌గ్గ‌ర నుంచి ప్ర‌స‌వం అయ్యే వ‌ర‌కు ఎన్నో జాగ్ర‌త్త‌లు పాటిస్తారు. కానీ, కొంద‌రిలో నెల‌లు నిండ‌క‌ముందే ప్ర‌సవం జ‌రిగిపోతుంటుంది. అది పుట్టే బిడ్డ‌కు, అతికొద్ది స‌మ‌యాల్లో త‌ల్లికి కూడా మంచిది కాదు. అయితే ఇలా ప్రీ మెచ్యూర్ బ‌ర్త్స్ ఎందుకు జ‌రుగుతాయి? పూర్తిగా నెల‌లు నిండే వ‌ర‌కు ప్ర‌స‌వం రాకుండా ఉండేందుకు ఏం చేయాలి? అనే వాటిపై ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు సంస్థ‌లు అధ్య‌య‌నాలు చేస్తూనే ఉన్నాయి. ఇటీవ‌ల ఆస్ట‌రేలియా లోని క్వీన్స్ లాండ్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధకుల చేసిన స్ట‌డీలో ఆస‌క్తిక‌ర నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. మ‌హిళ‌లు సంప్ర‌దాయ వెజిటేరియ‌న్స్ అయి ఉంటే నెల‌లు నిండ‌క‌ముందు ప్ర‌స‌వం వ‌చ్చే ముప్పు చాలా త‌గ్గిన‌ట్లు గుర్తించామ‌ని తెలిపారు.

క్యారెట్, క్యాబేజీ, బీన్స్, ఇంకా…

క్వీన్స్ లాండ్ యూనివ‌ర్సిటీలో PhD చేస్తున్న దీరెజ్ గేట్ 3500 మంది మ‌హిళ‌ల డైట్ పై అధ్య‌య‌నం చేశారు. క్యారెట్, క్యాలీఫ్ల‌వ‌ర్, బ్ర‌కోలీ, గుమ్మ‌డి, క్యాబేజీ, బీన్స్, ఆలూ వంటి సంప్ర‌దాయ వెజిటబుల్స్ తీసుకోవ‌డం చాలా మంది మ‌హిళ‌ల్లో నెల‌లు నిండిన త‌ర్వాతే ప్ర‌స‌వం వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు. ఈ ట్రెడిష‌న‌ల్ వెజిట‌బుల్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ ఫ్ల‌మేట‌రీ పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయ‌న్నారు. గ‌ర్భం దాల్చ‌క ముందు నుంచి వీటిని రెగ్యుల‌ర్ డైట్ లో తీసుకునే మ‌హిళ‌ల‌కు డెలివ‌రీలో స‌మ‌స్య‌లు చాలా త‌గ్గుతాయ‌ని తెలిపారు డెరెజ్. అలాగే ఐర‌న్, క్యాల్సియం ఈ పుడ్స్ లో ఎక్కువ‌గా ఉంటాయ‌ని, మ‌హిళ గ‌ర్భంలో పిండం, దాని చుట్టూ ర‌క్ష‌ణ‌గా ఉండే మాయ త‌యార‌వ‌డంలో వీటి పాత్ర కీల‌క‌మ‌ని చెప్పారు. అయితే చాలా మంది మ‌హిళ‌లు గ‌ర్భం నిర్ధార‌ణ అయ్యాక దాదాపుగా మూడో నెల నుంచి మంచి ఆహారం తీసుకోవ‌డం మొద‌లుపెడ‌తార‌ని, కానీ అప్ప‌టికే కీల‌క‌మైన స‌మ‌యం దాటిపోతుంద‌ని అన్నారు. పిండం, మాయ ఏర్ప‌డే స‌మ‌యంలోనే మంచి శ‌క్తి అవ‌స‌ర‌మ‌ని చెప్పారు.

ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన‌ప్పుడే…

మ‌హిళ‌లు క‌నీసం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్ప‌టి నుంచైనా మంచి డైట్ ఫాలో అవ్వాల‌ని ప్రొఫెస‌ర్ గీతా మిశ్రా సూచించారు. నెల‌లు నిండ‌క ముందే పుట్టిన పిల్ల‌లు పెరిగి యుక్త వ‌య‌సుకు వ‌చ్చిన త‌ర్వాత మెట‌బాలిక్, దీర్ఘ‌కాలిక అనారోగ్యాల బారిన‌ప‌డే ప్ర‌మాదం ఎక్కువ‌ని చెప్పారు. కొంద‌రిలో బుద్ధి మాంద్యం లాంటి స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయ‌న్నారు. ఆస్ట్రేలియాలో శిశువుల‌ మ‌ర‌ణాల్లో ఎక్కువ‌గా 37 వారాల కంటే ముందే జ‌రిగే ప్ర‌స‌వాల్లో పుట్టిన వారేన‌ని చెప్పారు. ప్ర‌తి ఏటా 8.5 శాతం ఇలాంటి ప్ర‌స‌వాలు ఉంటున్నాయ‌న్నారు.