హైదరాబాద్ సిటీ మళ్లీ వర్షం మొదలైంది. మూడు రోజులుగా సాయంత్రంపూట వర్షం పడుతూనే ఉంది. 2026, జూలై 31వ తేదీ ఉదయం నుంచి వర్షం లేదు. మబ్బులు ఉన్నాయి. చల్లటి వాతావరణం ఉంది. ఇవాల్టికి వర్షం లేదులే అనుకున్న సిటీ జనానికి షాక్ ఇస్తూ.. వర్షం ప్రారంభం అయ్యింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కసారిగా వాన మొదలుకావటంతో ఉద్యోగుల్లో పరేషాన్ నెలకొంది. అసలే వీకెండ్.. శుక్రవారం సాయంత్రం.. సహజంగానే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి టైంలో.. ఉద్యోగులు ఇళ్లకు.. పార్టీలకు వెళ్లే మూడ్ లో ఉండగానే వర్షం మొదలవ్వటంతో.. అందరికీ ట్రాఫిక్ పరేషాన్ పట్టుకుంది.
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, కూకట్ పల్లి, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్,సికింద్రాబాద్, అల్వాల్,బోయిన్ పల్లి, బాల్ నగర్, జగద్గీరి గుట్ట,మణికొండ, దిల్ సుఖ్ నగర్, కోటి,ఎల్బీ నగర్, ఉప్పల్, ఈసీఐఎల్, హయత్ నగర్ వంటి ఏరియాల్లో వర్షం పడుతోంది.
ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలోని ప్రధాన రోడ్ల వద్ద ట్రాఫిక్ పూర్తిగా మందకొడిగా కదులుతోంది. రాయదుర్గం, హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రధాన ఐటీ కారిడార్ లో వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐకియా సర్కిల్, రాయదుర్గం మెట్రో స్టేషన్ మీదుగా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also Read ; మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తిన భారీ వరద ..
ఈ క్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఐటీ, సాఫ్ట్వేర్ సంస్థల కోసం ప్రత్యేకంగా ఒక ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. సైబరాబాద్ పరిధిలోని అన్ని కంపెనీలు, సంస్థలు ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల నుంచి దశలవారీగా ఉద్యోగులకు ఎర్లీ లాగ్ అవుట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి.
ఉద్యోగులందరూ ఒకేసారి రోడ్లపైకి వచ్చి భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా నివారించడమే ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశం. వర్షాల సమయంలో ప్రయాణ ప్రమాదాలను తగ్గించేందుకు, అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కంపెనీలు తమ కార్యాలయ ప్రాంతం, ఎర్లీ లాత్అవుట్ సమయాలను ట్రాఫిక్ పోలీసులకు ముందుగానే తెలియజేయాలని కోరారు. ట్రాఫిక్ నిర్వహణకు ఐటీ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు సహకరించాలని.. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
