నా కొడుకు చనిపోయినట్టే.. చావు.. క్లాస్మేట్ తల్లిదండ్రులు తిట్టారని టెన్త్ స్టూడెంట్ సూసైడ్

నా కొడుకు చనిపోయినట్టే.. చావు..  క్లాస్మేట్ తల్లిదండ్రులు తిట్టారని టెన్త్ స్టూడెంట్ సూసైడ్
  • మియాపూర్​లో ఘటన
  • స్కూల్​ యాజమాన్యం ఓవరాక్షన్​తో ఐదు రోజుల వ్యవధిలో ఇద్దరు స్టూడెంట్స్​ ఆత్మహత్య !

మియాపూర్, వెలుగు: వారం కింద తోటి విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా.. అందుకు నీవే కారణమని మృతుడి బంధువులు తిట్టడంతో పదో తరగతి విద్యార్థిని సూసైడ్​ చేసుకుంది. మియాపూర్​ జనప్రియ అపార్ట్​మెంట్స్ డి బ్లాక్  నాలుగో అంతస్తులో నివాసముంటున్న బిజయ్ నాయక్, చిన్మయి నాయక్ దంపతులు. వీరి కుమార్తె హన్సిక నాయక్(15) మాధవ్ నగర్​లోని సెయింట్ మార్టిన్ స్కూల్​లో పదో తరగతి చదువుతోంది. అదే స్కూల్​లో మియాపూర్ మాధవనగర్​కాలనీకి చెందిన షేక్ అహ్మద్, జహీరు నిస్సాబేగం దంపతుల కొడుకు రిజ్వాన్(15) చదువుతున్నాడు.

వీరిద్దరు కొద్ది రోజులుగా చాటింగ్​ చేసుకుంటుండగా, స్కూల్ టీచర్ గమనించి ప్రిన్సిపాల్​కు తెలిపింది. దీంతో ఈ నెల 19న ఇరువురు తల్లిదండ్రులను స్కూల్​కు​ పిలిపించి మాట్లాడుతుండగా, చాటింగ్​ విషయం తన తల్లికి తెలిసిందని రిజ్వాన్​ స్కూల్ బిల్డింగ్ ఐదో ఫ్లోర్​ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తరువాత వరుసగా స్కూల్​కు నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. మరుసటి రోజు గురువారం హన్సిక.. తండ్రితో కలిసి స్కూల్​కు వెళ్లింది. 

స్కూల్​ యాజమాన్యం ఓవరాక్షన్​..

స్కూల్​కు వెళ్లిన హన్సికను టీచర్లు అనుమతించలేదు. ముందుగా రిజ్వాన్​ కుటుంబ సభ్యులను పరామర్శించాలని, ఆ తరువాత స్కూల్​కు రావాలని హన్సిక తండ్రికి ప్రిన్సిపాల్​ చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే హన్సికతో పాటు తండ్రి బిజాయ్ ​నాయక్​ మాధవ్ నగర్ లోని రిజ్వాన్ ఇంటికి వెళ్లారు. 

మృతుడి కుటుంబ సభ్యులు వారిని దూషించారు. ‘నా కొడుకు చనిపోయినట్టే.. చావు’  అంటూ హన్సికపై మండిపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంటికి వెళ్లగానే ఐదో అంతస్తు నుంచి కిందికి దూకి సూసైడ్​ చేసుకుంది.ఈ ఘటనపై పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు.

బీటెక్​ స్టూడెంట్​ ఆత్మహత్య

ఘట్​కేసర్: రైలు కింద పడి ఓ బీటెక్ స్టూడెంట్​ ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి -భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం మోదుగాయగూడేనికి చెందిన ఉప్పుల రాజేందర్(21) పోచారం మున్సిపాలిటీ యనంపేటలో ఓ హస్టల్​లో ఉంటూ శ్రీనిధి ఇంజినీరింగ్​ కాలేజీలో ఫోర్త్​ ఇయర్​ చదువుతున్నాడు. గురువారం తెల్లవారుజామున యంనంపేట్ రైల్వే బ్రిడ్జి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం గాంధీకి తరలించారు.