వైరల్: కారుపై కుప్పకూలిన భారీ స్తంభం.. ఎస్పీ నేత స్పాట్ లోనే..

వైరల్: కారుపై కుప్పకూలిన భారీ స్తంభం.. ఎస్పీ నేత స్పాట్ లోనే..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఆదివారం పట్టపగలు జరిగిన ఒక ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది. సమాజ్‌వాదీ పార్టీ నేత లాల్ బహదూర్ యాదవ్ ప్రయాణిస్తున్న కారుపై భారీ హైమాస్ట్ లైట్ పోల్ కూలిపోవడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాబుగంజ్ మార్కెట్ సమీపంలోని ఒక పెట్రోల్ పంపు వద్ద జరుగుతున్న అజాగ్రత్త పనులే ఈ ప్రమాదానికి కారణంగా మారింది. సుమారు 1,000 కిలోల బరువున్న ఆ భారీ స్తంభం ఒక్కసారిగా కారుపై పడటంతో హ్యుందాయ్ క్రెటా వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

లాల్ బహదూర్ యాదవ్ తన వ్యక్తిగత పనిపై బాబుగంజ్ నుంచి ప్రతాప్‌గఢ్ నగరానికి వెళ్తున్న క్రమంలో.. తన ఇంటికి కేవలం 500 మీటర్ల దూరంలోనే ప్రమాదానికి గురయ్యారు. భారత్ పెట్రోలియంకు చెందిన సుమారు 65 అడుగుల ఎత్తున్న హైమాస్ట్ లైట్ పోల్‌ను క్రేన్ సహాయంతో బంక్ వద్ద ఏర్పాటు చేస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. క్రేన్‌కు కట్టిన బెల్ట్ ఒక్కసారిగా తెగిపోవడంతో.. ఆ భారీ పోల్ అదుపు తప్పి నేరుగా రోడ్డుపై వెళ్తున్న యాదవ్ కారుపై పడిందని అక్కడ ఉన్న వ్యక్తులు వెల్లడించారు.

ప్రమాదం జరిగిన తీరు ఎంత భీభత్సంగా ఉందంటే.. లోపల ఉన్న యాదవ్‌కు స్పందించే అవకాశం కూడా లేకుండా పోయింది. స్థానికులు వెంటనే కారు తలుపులు పగులగొట్టి ఆయన్ను బయటకు తీసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ దీపక్ భూకర్.. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో అంత పెద్ద పని జరుగుతున్నప్పుడు వాహనాల రాకపోకలను నియంత్రించకపోవడం, నిర్లక్ష్యంగా కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై యాదవ్ కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కుటుంబ పెద్దను కోల్పోయామని యాదవ్ బాబాయ్ శంకర్ లాల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేశారు.