అన్నం పెట్టుమంటే కాళ్లు మొక్కించుకున్నరు

అన్నం పెట్టుమంటే కాళ్లు మొక్కించుకున్నరు
  • పిల్లలను చూసి కన్నీరుమున్నీరు
  • ఖమ్మం జిల్లా జైలు సిబ్బంది పై ఆరోపణలు 
  • చర్యలు తీసుకోవాలని జైలు ముందు ధర్నా
  • గిరిజన మహిళల ఆవేదన ఆరు రోజులకు జైలు నుంచి విడుదల

పోడు భూముల వివాదంలో అరెస్టయిన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్ గిరిజన మహిళలు బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. బయటకు వచ్చిన మహిళలు పిల్లలను హత్తుకుని కంటతడి పెట్టడం కలచివేసింది. జైల్లో తమతో చాకిరీ చేయించుకున్నారని, అన్నం పెట్టుమంటే కాళ్లు మొక్కించు కున్నారని, బాలింతను బంధించారని, టాయిలెట్లు క్లీన్​ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

 ఖమ్మం, వెలుగు: పోడు భూముల వివాదంలో అరెస్టయిన గిరిజన మహిళల పట్ల ఖమ్మం జిల్లా జైలు సిబ్బంది అమానవీయంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. అన్నం పెట్టుమంటే తమతో కాళ్లు మొక్కించుకున్నారని, బూతులు తిడుతూ కర్రలతో కొట్టారని, టాయిలెట్లు కడిగించారని,  ఇక్కడ చంపేసినా అడిగే దిక్కులేదంటూ బెదిరించారని బాధితులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ అక్కడే ఆందోళనకు దిగారు. కాగా, ఆరు రోజులకు బెయిల్​పై జైలు నుంచి విడుదలైన తమ కోసం ఇండ్ల నుంచి వచ్చిన కుటుంబసభ్యులను, పిల్లలను చూసి మహిళలు కన్నీరుమున్నీరయ్యారు. పసిపిల్లలు తమ తల్లులను హత్తుకొని గుక్కపట్టి ఏడ్చారు.

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్​ లో ఈ నెల 3న గిరిజన రైతులు, ఫారెస్ట్ సిబ్బంది మధ్య పోడు భూములకు సంబంధించి గొడవ జరిగింది. రిజర్వ్ ఫారెస్ట్ లో భూమిని కొత్తగా పోడు చేయడంతో స్వాధీనం చేసుకునేందుకు వెళ్లామని ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సిబ్బంది చెబుతుండగా, పత్తి చేలను పీకేస్తుండడంతో తాము అడ్డుకున్నామని గ్రామస్తులు అంటున్నారు. ఈ సందర్భంగా తమపై రాళ్లతో దాడి చేశారంటూ కొణిజర్ల పోలీసులకు అటవీ శాఖ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో అదే రోజు కేసు నమోదు కాగా, ఈ నెల 6న పోలీసులు 21 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. కోర్టు రిమాండ్​ విధించడంతో ఈ నెల 6న ఖమ్మం జిల్లా జైలుకు వారిని తరలించారు. వీరిలో మూడు నెలల బాలింత సహా 18 మంది మహిళలున్నారు. ముందుగా ఎఫ్ఐఆర్​లో ఐపీసీ 307, 353, 148 రెడ్ విత్ 149 సెక్షన్లు పెట్టిన పోలీసులు, తర్వాత విమర్శలతో వెనక్కితగ్గారు. హత్యాయత్నం సెక్షన్లు 307, 148ని వెనక్కి తీసుకుంటున్నట్టు కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో జిల్లా న్యాయస్థానంలో గిరిజనులకు మంగళవారం బెయిల్ దొరికింది.
జైలు బయట ఉద్రిక్తత 
ఆరు రోజుల తర్వాత బుధవారం గిరిజనులు బయటకు వస్తుండడంతో వారి కుటుంబసభ్యులు ఉదయం నుంచే జైలు గేటు బయట ఎదురుచూశారు. ఉదయం 10 గంటలకు బయటకు వచ్చిన మహిళలు తమ కోసం ఊరి నుంచి వచ్చినవారిని చూసి కన్నీరు పెట్టుకున్నారు. పిల్లలను చూస్తూ తల్లి కంటతడి పెట్టడం, జైల్లో ఉన్న మూడు నెలల చిన్నారిని అన్న ముద్దు చేయడం లాంటి దృశ్యాలతో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. అప్పుడే జైల్లో తమకు జరిగిన అన్యాయాలను మహిళలు వివరించడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 20 బస్తాల బియ్యం బాగు చేయించారని, బాలింతను గదిలో పెట్టి బంధించారని, టాయిలెట్ లు క్లీన్​ చేయించారని చెప్పారు. అన్నం పెట్టాలంటే ఓ మహిళా అధికారి తమతో కాళ్లు మొక్కించుకున్నారని, బూతులు తిడుతూ కర్రలతో కొట్టారని ఆరోపించారు. ఇక్కడే చంపేసినా అడిగే దిక్కు లేదంటూ బెదిరించారని, చర్లపల్లి జైలుకు పంపిస్తామని చెప్పారని మహిళలు అన్నారు. అప్పటికే అక్కడ ఎదురుచూస్తున్న సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావుతో పాటు ఎల్లన్ననగర్​ కు చెందిన గ్రామస్తులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలు, చిన్న పిల్లల తల్లులు అని కూడా చూడకుండా జైల్లో ఎలా చిత్ర హింసలు పెడతారంటూ ప్రశ్నించారు.  మహిళా జైలు సిబ్బందిపై చర్య తీసుకోవాలని, వారితో క్షమాపణ చెప్పించాలని మహిళలు డిమాండ్​చేశారు. జైలు ఎదుట ఎండలోనే అరగంటకు పైగా బైఠాయించారు. దీంతో జైలు సూపరింటెండెంట్ బయటకు వచ్చి మహిళలు, న్యూడెమోక్రసీ నేతలతో మాట్లాడారు. ఇతర ఖైదీలను విచారించి, ఘటనపై ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. జైలు సిబ్బంది తప్పు చేశారని తేలితే తప్పకుండా యాక్షన్​ తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 
మేమేమైనా టెర్రరిస్టులమా..
జైలుకు వచ్చినప్పటి నుంచి మాతోటి జైలు సిబ్బంది సరిగా ఉండలే. టాయిలెట్లు కడిగించారు. అన్నం ఆలస్యంగా పెడుతున్నారని, కూర లేదు అని అడిగితే కొట్టారు. మమ్మల్ని ఎలాగైనా శిక్షించాలని అనుకుంటూ, పచ్చి బూతులు తిట్టారు. ఇక్కడే చంపేసినా మీకు అడిగే దిక్కు లేదని అన్నారు. తిట్టిన, కొట్టిన విషయం బయటపెడితే బెయిల్ కూడా రాకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. టెర్రరిస్టులకు కూడా ఇలాంటి పనిష్మెంట్ ఉండదు. బాలింత అని కూడా చూడకుండా గదిలో బంధించారు.                                                                                                                     – గోగుల వెంకటమ్మ, ఎల్లన్ననగర్
మళ్లీ భూముల జోలికి పోవద్దన్నరు
జైలులో మాకు చెప్పిన పనులన్నీ చేశాం. గడ్డ పారతో కాల్వ తవ్వించారు. అందరితో 20 బస్తాల బియ్యం బాగు చేయించారు. మూడు నెలల పాపకు దగ్గు లేస్తదని, కనీసం బాలింతకైనా పని చెప్పకుండా పక్కకు పంపించాలని అడిగినా పట్టించుకోలేదు. మంచి నీళ్లు అడిగినా ఇవ్వలేదు. బయటకు పోయిన తర్వాత మళ్లీ పోడు భూముల జోలికి పోవద్దని భయపెట్టారు.                         – పద్మ, ఎల్లన్ననగర్​