ఒక ఊరి సర్వే నంబర్లకు బదులు.. మరో ఊరి నంబర్లు బ్లాక్ 

 ఒక ఊరి సర్వే నంబర్లకు బదులు.. మరో ఊరి నంబర్లు బ్లాక్ 

 

  • నిషేధిత జాబితాలోకి పట్టా భూములు
  • ఆధారాలు సమర్పించినా ఎన్​వోసీలు ఇవ్వని ఆఫీసర్లు 
  • ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్ బోర్డుల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు

హైదరాబాద్, వెలుగు: ధరణిలో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో పొరపాటున ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్ బోర్డు ఆస్తులుగా చేర్చిన పట్టా భూములకు విముక్తి లభించడం లేదు. డేటా ఎంట్రీలో గతంలో అధికారులు, సిబ్బంది చేసిన తప్పిదానికి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు(ఎన్ఓసీ) ఇవ్వాలని ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్ బోర్డు అధికారులకు అప్లికేషన్లు పెడితే స్పందించడం లేదు.  ఆ భూములు తమ బోర్డులవి కాకపోయినా ఎన్ఓసీ ఇచ్చేందుకు సతాయిస్తున్నారు. దీంతో బాధిత రైతులు తమ అవసరాలకు భూములు అమ్ముకోలేక, ప్రభుత్వ పథకాలు వర్తించక ఇబ్బందులు పడుతున్నారు. 
‘సీ’ కేటగిరీ భూముల్లో చేరిస్తే అంతే.. 
ప్రొహిబిటెడ్ జాబితా 22ఏ/సీ కేటగిరీలో ఎండోమెంట్, భూదాన్, వక్ఫ్ భూములు వస్తాయి. ప్రొహిబిటెడ్ లిస్టు ప్రిపేర్ చేసేటప్పుడు డేటా ఎంట్రీలో తప్పులు దొర్లడం వల్ల కొన్ని పట్టాభూముల సర్వే నంబర్లు 22ఏ/సీ కేటగిరీలో చేరిపోయాయి. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చేవేళ్ల గ్రామంలో ఎండో మెంట్ పరిధిలో165 సర్వే నంబర్ ఉంటే.. అధికారులు ఆ నంబర్ కు బదులు365 సర్వే నంబర్ ను బ్లాక్ చేశారు.

దీంతో బాధితులు ఎండోమెంట్ కమిషనర్ ను కలిసి ఎన్ని లెటర్లు ఇచ్చినా న్యాయం జరగడం లేదు. అధికారులు చేసిన తప్పిదాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టా భూములు ప్రభుత్వ భూములుగా పొరపాటున నమోదైతే.. అప్లికేషన్ పెట్టుకుంటే కొద్దిగా కష్టమైనా కలెక్టర్ స్థాయిలోనే పరిష్కారం దొరుకుతోంది. కానీ 22ఏ/సీ కేటగిరీ (ఎండోమెంట్,వక్ఫ్, భూదాన్ భూముల)లో పొరపాటున చేరితే వాటిని తొలగించడం లేదు. ఇలాంటి భూములను నిషేధి జాబితా నుంచి తొలగించాలంటే.. ఆయా బోర్డులు నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలి. కానీ ఎండోమెంట్, భూదాన్, వక్ఫ్ బోర్డుల అధికారులు ఎన్వోసీలు ఇవ్వడం లేదు. భూదాన్, వక్ఫ్ బోర్డులకు రెవెన్యూ అధికారులు లెటర్లు రాస్తే రిప్లై కూడా ఇవ్వడం లేదు. ఎండోమెంట్ అధికారులైతే ట్రిబ్యునల్ కు  వెళ్లమని సలహా ఇస్తున్నారు.

రైతులకు ఇబ్బంది
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్  బోర్డు అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా వేలాది ఎకరాల పట్టా భూములు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో చేరాయి. దీంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి భూముల అమమకాలు, కొనుగోళ్లు నిలిచిపోవడం వల్ల సర్కారు ఆదాయానికి కూడా గండిపడినట్లే. ఇప్పటికైనా స్పందించి ఇలాంటి పొరపాట్లను సవరించి రైతులకు న్యాయం చేయాలి. ఎన్ఓసీలు ఇవ్వడం ఆలస్యం చేయొద్దు

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ రెవెన్యూ పరిధిలోని చందుపట్లగూడెంలో 205, 206, 208, 209, 210, 224, 225, 226, 228, 229 సర్వే నంబర్లలో 24 ఎకరాల ఎండోమెంట్ ల్యాండ్ ఉంది. 2007లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నిషేధిత భూముల జాబితా ప్రిపేర్ చేసినప్పుడు అప్పటి ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఈ వివరాలు పంపారు. అధికారులు చందుపట్ల గూడెంలోని సర్వే నంబర్లను బ్లాక్ చేయాల్సి ఉండగా.. ఇదే మండలంలోని కొర్రెముల పరిధిలో ఉన్న సరిగ్గా ఇవే సర్వే నంబర్లను బ్లాక్ చేశారు. దీంతో కొర్రెములలోని పట్టాదారులకు సమస్యలొచ్చాయి. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా తమ సొంత భూములు రికార్డుల్లో ఎండోమెంట్ భూములయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.