
ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వగా.. మరోవైపు కవితకు సంఘీభావంగా హైదరాబాద్ లో టీఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాలలో ఫ్లెక్సీలు వెలిశాయి. ‘డాటర్ ఆఫ్ ఫైటర్ .. విల్ నెవర్ ఫియర్’, ‘తెలంగాణ గడ్డ కేసీఆర్ అడ్డా’, ‘వీ ఆర్ విత్ కవితక్క’ అనే నినాదాలను ఫ్లెక్సీలపై ప్రచురించారు. అయితే ఈ ఫ్లెక్సీలపై కేవలం కవిత, కేసీఆర్ ఫొటోలు మాత్రమే ఉండటం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంపై డిసెంబరు 6న వివరణ తీసుకుంటామంటూ శుక్రవారం రాత్రి ఎమ్మెల్సీ కవితకు సీబీఐ దర్యాప్తు అధికారి అలోక్ కుమార్ సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసును ఇష్యూ చేశారు. హైదరాబాదు లేదా ఢిల్లీలో ఎక్కడైనా సీబీఐ ముందు హాజరు కావాలన్నారు. శుక్రవారం రాత్రే స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. డిసెంబర్ 6న హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చి వివరణ తీసుకోవాలని సీబీఐ అధికారులకు తెలియజేశారు. మరో రెండు రోజుల్లో సీబీఐ అధికారులు వచ్చి నివాసంలో కవిత వివరణను తీసుకోనున్న నేపథ్యంలో హైదరాబాద్ లో టీఆర్ఎస్ శ్రేణులు ఆమెకు మద్దతుగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.
తాజాగా ఇవాళ సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి కవిత లేఖ రాశారు. సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా సంబంధిత కాపీలను అందించాలని పేర్కొన్నారు.