
* రెండేండ్లలో మరో లక్ష కోట్ల అప్పులైతయ్: భట్టి
* కేంద్ర నిధులతోనే గ్రామాల్లో పనులు చేస్తున్నరు
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని కుదువపెడుతోందని, విపరీతంగా అప్పులు చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. వచ్చే రెండేండ్లలో మరో లక్ష కోట్ల అప్పులైతాయని, దీంతో మొత్తం అప్పు రూ.6 లక్షల కోట్లకు చేరుతుందని తెలిపారు. ప్రభుత్వం చివరకు రాష్ట్రాన్ని డెడ్ ట్రాప్ లోకి నెట్టేస్తోందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వినియోగించకుండా, పక్కదారి పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శుల అంశంపై అసెంబ్లీలో తాము అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నేరుగా సమాధానం ఇవ్వలేదన్నారు. శుక్రవారం గన్ పార్క్ వద్ద ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రీధర్ బాబులతో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు.
సమావేశాలు ఆరు రోజులేనా?
దాదాపు నెల రోజులు జరగాల్సిన బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం కేవలం ఆరు రోజుల్లోనే ముగించిందని భట్టి మండిపడ్డారు. రూ.2.30 లక్షల కోట్ల భారీ బడ్జెట్ పై చర్చలను ఆరు రోజులకే పరిమితం చేయడం కరెక్టు కాదన్నారు. ప్రభుత్వం బడ్జెట్ ను పాస్ చేయించుకున్న తీరును ఖండిస్తున్నామన్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. తమ సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోయారు. అసెంబ్లీ సమావేశాలు అలంకారప్రాయంగా మారిపోయాయని, అర్థవంతమైన చర్చలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని భట్టి ఆరోపించారు. ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ లను అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవడంలో రాష్ట్ర సర్కార్ పూర్తిగా
విఫలమైందన్నారు.
కేంద్ర నిధులతోనే..
గ్రామాల్లో వైకుంఠధామాలు, ఇంకుడు గుంతలు, ప్రకృతి వనాల నిర్మాణ పనులు కేంద్రం ఇచ్చే నిధులతోనే జరుగుతున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇతర పనులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులిస్తే బాగుంటుందన్నారు. శుక్రవారం అసెంబ్లీలో భట్టి మాట్లాడారు. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాలని, స్టూడెంట్స్ అందరికీ వ్యాక్సిన్ వేయాలన్నారు. రాష్ట్రంలో బార్లు, క్లబ్స్, పబ్స్ బంద్ పెట్టాలని, వాటిపై వచ్చే ఆదాయం కంటే నష్టమే ఎక్కువన్నారు. గ్రామాల్లో కరోనా వ్యాప్తికి బెల్ట్ షాపులు కూడా కారణమని, వాటిని కంట్రోల్ చేయాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లకు ఫండ్స్ ఆగిపోయాయని, వెంటనే రిలీజ్ చేయాలన్నారు. ఉపాధి హామీ నిధులు పక్కదారి పడుతున్నాయన్నారు.
ధరణితో కొత్త సమస్యలు
ఆక్స్‌ఫాం అనే ఎన్జీవో సర్వే ప్రకారం రాష్ట్రంలో 55 శాతం జనాభా తలసరి ఆదాయం రూ.11 వేలు మాత్రమేనని, తక్కువ ఆదాయం ఉన్న వారి కోసం ప్రత్యేక ప్రణాళిక తీసుకురావాలన్నారు. పింఛన్లు, కల్యాణలక్ష్మి తాత్కాలిక ఉపశమనాలే తప్ప శాశ్వత పరిష్కారాలు కావన్నారు. మూడెకరాల భూ పంపిణీ, డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ఉంటే తలసరి ఆదాయం పెరిగేదన్నారు. గతంలో రెవెన్యూ రికార్డుల్లో పొరబాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి ఛాన్స్ ఉండేదని, ధరణి వచ్చాక చిన్న సమస్యకు కూడా సివిల్ కోర్టుకు పొమ్మంటున్నారని ఆరోపించారు. ఏజెన్సీ ఏరియాల్లో 1969 కంటే ముందున్న పట్టాదారుల వివరాలు ధరణిలో రావడం లేదన్నారు. సంగమేశ్వరం పనులు పూర్తయితే దక్షిణ తెలంగాణలోని 29 లక్షల ఎకరాలకు నష్టం జరుగుతుందన్నారు. తాము ప్రాజెక్టుల డీపీఆర్‌లు అడిగినా ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు.