ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మొద్దు

ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మొద్దు

హైదరాబాద్:  ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మొద్దని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని కోరారు.  దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్, కర్ణాటక, చత్తీస్ఘడ్, తెలంగాణలో ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలను అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్మానించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఈ సందర్భంగా కేంద్రానికి ఆమె పలు ప్రశ్నలు సంధించారు. దమ్ముంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం జాతీయ ఆస్తులను అమ్ముకుంటూ పోతోందన్న ఆమె... ఆదిలాబాద్ ఫ్యాక్టరీ అమ్మగా వచ్చే డబ్బును రాష్ట్రం కోసం వినియోగించనున్నారా లేదా అని ప్రశ్నించారు. ఆ డబ్బుతో రాష్ట్రంలో ఏవైనా కొత్త ఫ్యాక్టరీలను పెట్టనున్నారా అని ప్రశ్నించారు.

ఆదిలాబాద్ ఫ్యాక్టరీని అమ్మితే చాలా మందికి ఉపాధి లేకుండా పోతోందన్న ఆమె... వారందరికి ఉపాధి కల్పిస్తారా లేదా అని అడిగారు.  ఫ్యాక్టరీ అమ్మగా వచ్చే డబ్బును అసలు రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టనున్నారా లేక వేరే రాష్ట్రాలకు ఇవ్వనున్నారా అని నిలదీశారు. సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన 1500 ఎకరాల భూమిని, అలాగే అందులోనే మెషినరీని అమ్మితే... అలాంటి ఆస్తులను మళ్లీ పొందడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మొద్దని, నిజంగా ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంటే వాటిని పూడ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రానికి పదే పదే చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఫ్యాక్టరీ మూసివేస్తే కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడతాయని, అలాంటిది జరిగితే ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా కేంద్రం ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

అభిమాని లేఖకు ధోని ఫిదా..రిప్లై ఏమిచ్చాడో తెలుసా

ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష