ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష

ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 నుంచి ప్రారంభంకానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుకు చేపట్టాల్సిన కార్యాచరణతో పాటు, వరి ధాన్యం సేకరణ, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ నెల 20 నుంచి నిర్వహించతలపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను జూన్ 3 నుంచి ప్రారంభించాలని సమావేశం సీఎంను కోరింది. ఈ విజ్ఞప్తి మేరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను జూన్ 3 నుంచి 15 రోజులపాటు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వరిధాన్యం సేకరణపై సీఎం కేసిఆర్ ఆరాతీశారు. ధాన్యం తూకం, గన్నీ బ్యాగులు, రవాణ, మిల్లుల్లో దిగుమతి తదితర వరిధాన్య సేకరణ ప్రక్రియ గురించి సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 56 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 20 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించామని అధికారులు సీఎం కి తెలిపారు. తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటామని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో ధాన్య సేకరణ వేగవంతం చేయాలన్నారు. అకాల వర్షాల కారణంగా అక్కడక్కడ ధాన్యం తడుస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని సీఎం మరోసారి స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గరపడ్డయ్

కేటీఆర్ సైకోలా మాట్లాడుతుండు....