ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న యుద్ధంలో కీలక మలుపు. 2026, మార్చి 13వ తేదీన.. ఇరాన్ అనుసరించిన వ్యూహం ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. టర్కీ దేశంలో అమెరికాకు ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది. ఇక్కడి నుంచి ఇరాన్ దేశంపైకి బాంబులు వేస్తోంది అమెరికా, ఈ క్రమంలోనే టర్కీలోని అమెరికా ఎయిర్ బేస్ పై బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగిస్తుంది ఇరాన్. ఈ సెంటర్‌లో అణు బాంబులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే 13వ తేదీ తెల్లవారుజామున ఇరాన్ దేశం నుంచి బాలిస్టిక్ మిస్సైల్స్ దూసుకొచ్చాయి. ఈ వెంటనే పెద్ద శబ్దంతో సైరన్స్ మోగాయి.. రెడ్ అలర్ట్ ప్రకటించింది టర్కీ దేశం. ఈ దాడిపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఇరాన్ యుద్ధపు సెగలు ఇప్పుడు NATO కూటమికి కీలకమైన టర్కీ గడ్డను తాకాయి. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3:25 గంటల సమయంలో టర్కీలోని అదానా నగర సమీపంలో ఉన్న 'ఇన్సిర్లిక్' వైమానిక స్థావరంలో యుద్ధ సైరన్లు మోగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. అమెరికా సైనికులు భారీ సంఖ్యలో ఉన్న ఈ వ్యూహాత్మక స్థావరంలో సుమారు 5 నిమిషాల పాటు రెడ్ అలర్ట్ సైరన్లు మోగడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇరాన్ నుండి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని నాటో వైమానిక రక్షణ వ్యవస్థ టర్కీ గగనతలంలోనే కూల్చివేసిన నాలుగు రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. 5 రోజుల్లో ఇరాన్ నుంచి టర్కీని లక్ష్యంగా చేసుకుంటూ క్షిపణి రావడం ఇది రెండోసారి.
అదానా నగర ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన వస్తువు వేగంగా దూసుకుపోతున్న దృశ్యాలను స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇన్సిర్లిక్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్న క్షిపణి కావచ్చని అంతా భావిస్తున్నారు. ఈ ఎయిర్‌బేస్ నాటో దళాలకు అత్యంత కీలకమైనది మాత్రమే కాకుండా.. ఇక్కడ భారీ స్థాయిలో అణ్వాయుధాలు నిల్వ ఉన్నాయనే ప్రచారం చాలా కాలం నుంచే జరుగుతోంది. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అణ్వస్త్రాలు ఇక్కడ భద్రపరిచారనే సమాచారంతోనే ఇరాన్ ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అదానాలోని తన కాన్సులేట్‌ను మూసివేసిన అమెరికా.. ఆ ప్రాంతంలో ఉన్న తమ పౌరులను తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించింది.
టర్కీలోని మరో కీలక నాటో కేంద్రమైన కురెసిక్‌లో కూడా అమెరికా దళాలు ఇప్పటికే మోహరించబడి ఉన్నాయి. అక్కడ ఇప్పటికే పేట్రియాట్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను సిద్ధంగా ఉంచారు. ఇరాన్ వరుసగా క్షిపణి దాడులకు ప్రయత్నిస్తుండటంతో, టెహ్రాన్ ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని టర్కీ ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మార్చి 4న మొదటి క్షిపణిని అడ్డుకోగా.. తాజాగా రెండో క్షిపణిని కూడా నాటో దళాలు కూల్చివేశాయి. అణ్వాయుధాలు ఉన్నాయని భావిస్తున్న ఈ స్థావరాలపై దాడులు జరిగితే, అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయంగా ఆందోళనలు పెరుగుతున్నాయి.
