బీజేపీ డబుల్‌‌‌‌ ఇంజన్‌‌‌‌ అంటే మోడీ, ఈడీ, జుమ్లా..హమ్లా

బీజేపీ డబుల్‌‌‌‌ ఇంజన్‌‌‌‌ అంటే మోడీ, ఈడీ, జుమ్లా..హమ్లా
  • వరద వల్ల గోసపడుతున్న గోదావరి బేసిన్​ ప్రజలు
  • నేషనల్​ పాలిటిక్స్​పై ఇతర  రాష్ట్రాల సీఎంలు, పార్టీల చీఫ్​లతో కేసీఆర్​ మంతనాలు
  • రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో కేటీఆర్​ చిట్​చాట్​
  • కాళేశ్వరం పంపుహౌస్‌‌లు మునగడం, జీతాలు లేట్‌‌ సాధారణమేనని కామెంట్​
  • నది పక్కనే పంపుహౌస్‌‌‌‌లు ఉంటయ్​.. నీళ్లు వస్తే మునిగినయ్​
  • జీతాలు ఒకరోజు ముందు వెనుకా రావొచ్చు.. అందులో ఏముంది?


హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో షెడ్యూల్‌‌‌‌ ప్రకారమే అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని, 90కిపైగా సీట్లతో కేసీఆర్‌‌‌‌ నాయకత్వంలో తమ పార్టీ హ్యాట్రిక్‌‌‌‌ కొట్టడం ఖాయమని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌, మంత్రి కేటీఆర్‌‌‌‌ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌  చేయించుకున్న సర్వేల్లోనూ ఇదే విషయం తేటతెల్లమైందని పేర్కొన్నారు. బీజేపీ డబుల్‌‌‌‌ ఇంజన్‌‌‌‌ అంటే మోడీ, ఈడీ జుమ్లా, హమ్లా అని కేటీఆర్​ విమర్శించారు. ఎవరి బెదిరింపులకు కేసీఆర్​ లొంగరని  అన్నారు.  శుక్రవారం నందినగర్‌‌‌‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో చిట్ చాట్‌‌‌‌ చేశారు. అసెంబ్లీకి 2023లోనే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. కేంద్రం ఎన్నికల తేదీని ప్రకటిస్తేనే అసెంబ్లీ రద్దు చేస్తామని సీఎం అన్నారని గుర్తుచేయగా.. అన్ని వ్యవస్థలతో పాటు సీఈసీ కూడా కేంద్రం చేతిలోనే ఉందని ఆయన అన్నారు. మూడోసారి కేసీఆరే సీఎం అవుతారని పేర్కొన్నారు. ‘‘నది పక్కనే పంపుహౌస్‌‌‌‌లు ఉంటయ్‌‌‌‌, వరదలు వచ్చి అవి మునిగితే కూడా రాజకీయం చేస్తున్నరు.. అసాధారణ పరిస్థితుల్లో వచ్చే వరదలను ఎలా ఆపగలం.. పంపుహౌస్‌‌‌‌లు ఎందుకు మునిగాయో కేంద్ర బృందాన్ని పంపి పరిశీలించుకోవచ్చు’’ అని కేటీఆర్​ అన్నారు. శత్రు దేశాలపై ఆర్థిక ఆంక్షలు పెట్టినట్టుగా రాష్ట్రాలకు అప్పుల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. రైతులపై కేంద్రం కక్షకట్టిందని ఆరోపించారు. ‘‘జాతీయ ఉపాధి హామీ కింద రైతు వేదికలు నిర్మించొద్దా.. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు కల్లాలు నిర్మించొద్దా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లాగా తిని కూర్చోవాలా.. మీకు సిగ్గుంటే ఉపాధి హామీ నిధులతో తెలంగాణలో ఎలాంటి అస్సెట్స్‌‌‌‌ క్రియేట్‌‌‌‌ చేశామో దేశానికి చెప్పాలె..’’ అని ఆయన అన్నారు. ప్రధానికి మానవత్వం ఉంటే వరదలు వచ్చినప్పుడు ముందస్తు సాయం అందించాలని డిమాండ్​ చేశారు. 

జీతాలు ఒకరోజు ముందు వెనుకా రావొచ్చు

రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం జీతాలు, ప్రభుత్వ నిర్వహణ, వెల్ఫేర్‌‌‌‌ స్కీంలకు సరిపోతున్నదని, రాష్ట్రంలో అదనపు హంగులు, సంపద సృష్టించేందుకు అప్పులు చేస్తున్నామని కేటీఆర్​ తెలిపారు. ముమ్మాటికీ తెలంగాణ మిగులు ఆదాయం ఉన్న రాష్ట్రమేనని అన్నారు. అన్నిరంగాల్లో జాతీయ సగటు కన్నా తెలంగాణ గ్రోత్‌‌‌‌ ఎక్కువ ఉందన్నారు. ఉద్యోగులకు జీతాలు ఒకరోజు ముందు వెనుకా రావొచ్చు అని, అందులో ఏముందని ప్రశ్నించారు. ఉద్యోగుల జీతాలు పెంచింది కేసీఆరే కదా అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకన్నా మన ఉద్యోగుల జీతాలే ఎక్కువ అని తెలిపారు. మోడీ కన్నా ముందు దేశాన్ని పాలించిన అందరు ప్రధానులు కలిసి రూ. 56 లక్షల కోట్ల అప్పులు చేస్తే, మోడీ ఒక్కరే వంద లక్షల కోట్లు అప్పు చేశారని, ఆ మొత్తాన్ని ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు. పాజిటివ్‌‌‌‌ వార్తలకు మీడియాలో స్పేస్‌‌‌‌ లేదని, తాను కేసీఆర్‌‌‌‌ కొడుకును కాబట్టే ఎక్కువ కవరేజ్‌‌‌‌ ఇస్తున్నారని, వరదల సమయంలో తమ మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఫీల్డ్‌‌‌‌లోనే ఉండి పనిచేస్తున్నారని తెలిపారు. ధరణి సమస్యలు పరిష్కరిస్తామని, కొత్త రేషన్‌‌‌‌ కార్డులు, పింఛన్లు ఇవ్వాల్సి ఉందని, వంద శాతం ఇస్తామని చెప్పారు.

పోడు భూముల సమస్య పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆర్‌‌‌‌వోఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ చట్టం కటాఫ్‌‌‌‌ తేదీని మార్చాల్సింది కేంద్రమేనని తెలిపారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ పార్లమెంట్‌‌‌‌ సమావేశాల్లో దానికి సవరణ చట్టం ప్రతిపాదించాలని ఆయన డిమాండ్​ చేశారు. ఎంపీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌ రాష్ట్ర అధ్యక్షులు చట్ట సవరణ కోసం ప్రయత్నించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలకే టికెట్‌‌‌‌ వస్తుందని, వాళ్లే గెలుపు గుర్రాలు అవుతారని అన్నారు. ప్రభుత్వాలను కూల్చుతాం, చీల్చుతామని బీజేపీ అహంకారంతో మాట్లాడుతున్నదని, ఇప్పటి వరకు తొమ్మిది రాష్ట్రాల్లో అప్రజాస్వామికంగా ప్రభుత్వాలు కూల్చేశారని దుయ్యబట్టారు. ‘‘రూపాయి విలువ పడిపోతే దేశం ఆత్మగౌరవం పడిపోతుందని మోడీ ఆనాడు అన్నరు.. ఇప్పుడు ఆ మాటలు గుర్తు చేయాల్సిన అవసరం దేశ ప్రజలకు ఉంది..’’ అని ఆయన  అన్నారు. 

టీఆర్​ఎస్​ బలంగా ఉందనడానికి గొడవలే నిదర్శనం

టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి కొందరు లీడర్లు బయటకు వెళ్లొచ్చని, ఇతర పార్టీల నుంచి టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లోకి రావొచ్చని కేటీఆర్​ అన్నారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ బలంగా ఉందనడానికి కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య ఉన్న గొడవలే నిదర్శనమని వ్యాఖ్యానించారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఒక్కటే రాష్ట్రమంతా ఉందని, మిగతా పార్టీలకు సగం నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరన్నారు. షర్మిల పార్టీ ప్రభావం కూడా కొన్ని చోట్ల ఉందని తెలిపారు. ప్రైవేట్‌‌‌‌ కార్యక్రమాలకు ప్రధాని వస్తే సీఎం స్వాగతం పలకాల్సిన అవసరం లేదని, మన్మోహన్‌‌‌‌ సింగ్‌‌‌‌ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్‌‌‌‌కు వెళ్తే అప్పుడు అక్కడ సీఎంగా ఉన్న మోడీ కూడా స్వాగతం పలకలేదన్నారు. దేశానికి కాకుండా గుజరాత్‌‌‌‌కు పీఎంగా మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌‌‌‌లో ఎవరికీ కనబడని ఫ్లై ఓవర్లు కడుతున్న ప్రధానికి ధన్యవాదాలు అంటూ ఎద్దేవా చేశారు. కేంద్రం తెలంగాణకు ఎక్కువ నిధులు ఇచ్చినట్టు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

కాంగ్రెస్​ చచ్చిపోయింది

రాహుల్ నాయకత్వలో కాంగ్రెస్‌‌‌‌ చచ్చిపోయిందని కేటీఆర్​ విమర్శించారు. అమేథీలో ఓడిన రాహుల్‌‌‌‌, కొడంగల్‌‌‌‌లో ఓడిన రేవంత్‌‌‌‌ సిరిసిల్లలో కాంగ్రెస్‌‌‌‌ను ఎలా గెలిపిస్తారని ఆయన ప్రశ్నించారు. రాహుల్‌‌‌‌ సిరిసిల్లకు వస్తే స్వాగతిస్తానని, ఆయన ఇక్కడే రెండ్రోజులు ఉండి నేర్చుకొని వాటి ఆధారంగా అమేథీ ప్రజల మనుసు గెలుచుకోవాలని సూచించారు. గిరిజన మహిళను రాష్ట్రపతిని చేస్తామని చెప్తున్న బీజేపీ.. వారి హక్కులను లాక్కునేలా బిల్లు తీసుకొస్తున్నదని, పార్లమెంట్‌‌‌‌లో దాన్ని అడ్డుకుంటామని చెప్పారు. తెలంగాణ వస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్న లగడపాటి రాజగోపాల్‌‌‌‌ మాట నిలబెట్టుకున్నారన్నారు.