న్యూయార్క్: పశ్చిమాసియాలో శాంతి యత్నాలకు మళ్లీ విఘాతం కలిగింది. ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ తీసేలా అమెరికా సమాయత్తమవుతున్నది. ఈ వారాంతంలోనే ఇరాన్‌లోని కీలక ప్రాంతాలపై అత్యంత శక్తివంతమైన వైమానిక, క్షిపణి దాడులు జరిపేందుకు సైన్యానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలిచ్చారు. క్యాంప్ డేవిడ్ అధ్యక్ష నివాసంలో జరిగిన అత్యున్నత కేబినెట్ సమావేశంలో ఈ మేరకు ఆర్మీకి దిశా నిర్దేశం చేశారు. అనంతరం ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
“ఇరాన్‌ను అత్యంత తీవ్రంగా దెబ్బతీస్తాం.. ఇక మేం తట్టుకోలేం అని వారు స్వయంగా లొంగిపోయే వరకు ఈ దాడులు కొనసాగుతాయి” అని ట్రంప్ స్పష్టం చేశారు. ఆ దేశం నిరంతరం అబద్ధాలు చెబుతూ ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని, వారిపై తనకు ఉన్న నమ్మకం పూర్తిగా సడలిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ పోరులో తమకు కావలసిందల్లా కేవలం పరిపూర్ణ విజయమే అని తేల్చి చెప్పారు.
చమురు శుద్ధి కర్మాగారాలే ఫస్ట్ టార్గెట్..!
వార్తా సంస్థల నివేదిక ప్రకారం.. ఇరాన్ ఆర్థిక మనుగడకు వెన్నెముకలాంటి చమురు రంగాన్ని, ప్రధాన ఇంధన మౌలిక వసతులను, రిఫైనరీలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలని అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహరచన చేశాయి. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ మళ్లీ పూర్తిస్థాయి యుద్ధరంగంలోకి దిగడం ఇదే తొలిసారి కానుంది.
ట్రంప్ అధ్యక్షతన అమెరికా సైన్యం పూర్తి సన్నద్ధతతో ఉన్నదని, ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని సాధించలేదని పెంటగాన్ అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ తెలిపారు. సోమవారం ఉదయం అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లు తెరుచుకునే సమయానికి ప్రధాన దాడుల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. దాడుల తీవ్రత వల్ల గ్లోబల్ మార్కెట్లు, ముడిచమురు ధరలు ప్రభావితం కాకుండా చూడడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
